తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నాయకులు ఇప్పుడు పారిపోయి తలదాచుకోవాల్సి వస్తోంది. జీతాలివ్వడం లేదని ప్రభుత్వంపై గవర్నర్‌కూ ఫిర్యాదు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారయణ అరెస్టుకు రంగం సిద్ధమైంది. వాణిజ్య పన్నులశాఖలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం..అరెస్టుకు ఆదేశించింది.రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సూర్యనారాయణ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆయన పరారీలో ఉన్నారు.
సూర్యానారాయణను ఎట్టి పరిస్థితుల్లో బొక్కలో వేయాలని ప్రభుత్వపెద్దలే కేసును మానిటర్ చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం నాలుగేళ్లుగా చేస్తున్న పనే. ఎవరు నోరెత్తితే వారిపైకి కేసులు పెట్టి పోలీసుల్ని పంపడం అనేది సహజంగా జరిగిపోతూ ఉంది. ఉద్యోగ నేతలకూ అదే పరిస్థితి. కేసుల గోల ఎందుకు అనుకున్న బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి వంటి వాళ్లు ఉద్యోగుల ప్రయోజనాలను పప్పుబెల్లాలకు తాకట్టు పెట్టి ప్రశాంతంగా … నెల జీతాలు తీసుకుంటున్నారు. ఇక గీతాల సంగతి చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వంతో బోలెడన్ని పనులు. కానీ ఉద్యోగుల కోసం పోరాడేవారే అసలైన విలన్లు. ఇప్పటికే ఉద్యమ కార్యచరణ ప్రకటించిన బొప్పరాజు వెంకటేశ్వర్లకూ ఇదో హెచ్చరిక అనుకోవచ్చు.
స్థానిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎస్ఈవోపై తిరగబడటానికి ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏమయింది… ఆ ప్రభుత్వమే వీరిపై విరుచుకుపడుతోంది. అరెస్టులు చేయడానికీ వెనుకాడటం లేదు. నాలుగేళ్ల నుంచి ఈ ప్రభుత్వం చేసేది ఇదే. పాము తన గుడ్లను తాను తిన్నట్లుగా అధికారంలోకి రావడానికి సహకరించిన వారందరికీ ఇలాంటి ట్రీట్ మెంట్ ఇస్తోంది. ఇక ఓటర్లకూ అదే పథకాన్ని ప్రారంభిస్తారు.. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా !