ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్టేట్ ఎన్నిక కమిషన్ ప్రకటించడంపై ప్రభుత్వం మండిపడింది. ప్రముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు సిద్ధంగా లేరని చెప్పుకొచ్చారు. వారు కరోనా భయంతో ఉన్నారని ఎన్నికలు విధులు నిర్వహించడానికి భయపడుతున్నారన్నారు. వారు సిద్దంగా లేకుండా.. ఎస్ఈసీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని చెప్పుకొచ్చారు. అదే అభిప్రాయంతో.. సీఎస్ నీలం సాహ్ని.. ఎస్ఈసీకీ లేఖరాశారు. గతంలో… కరోనా లాక్ డౌన్ టైంలో ఎన్నికలు నిర్వహించాలని లేఖ రాసిన ఆమె.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించవద్దని లేఖ రాశారు. ఏపీ సర్కార్ అభిప్రాయం అదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రభుత్వ స్పందనపై.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా.. రాజ్యాంగ పరంగా స్పందిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అడ్డుపడేలా… కొంత మంది ప్రభుత్వ పెద్దలు ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్నారని ముందుగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
రాజ్యాంగ ప్రకారం వ్యవహరిస్తామని .. ప్రమాణం చేసి.. ప్రజాస్వామ్య పదవులు పొందిన కొంత మంది స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని.. కరోనా పేరుతో ఎన్నికలను ఆపేందుకు ప్రత్నిస్తున్నారని ఆయన కొన్ని ఉదాహరణలను తన లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీకి పూర్తి స్థాయిలో సహకరించాలని హైకోర్టు ఆదేశించిన నేపధ్యంలో.. అలా సహకరించడం లేదని… ముందుగా.. గవర్నర్కు నిమ్మగడ్డ లేఖ రాయడం అధికారవర్గాల్లోనూ కలకలం రేపుతోంది. కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా… ఎన్నికల నిర్వహణకు కరోనా భయం కారణాన్ని మీడియాకు చెబుతూ వస్తున్నారు.
గవర్నర్కు లేఖ రాసిన ఎస్ఈసీ నేరుగా కలిసి ఫిర్యాదు చేసేందుకు సమయం కూడా తీసుకున్నారు. అదే సమయంలో నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. కలెక్టర్లు సహకరించకపోతే.. ఆ విషయాన్ని హైకోర్టుకు తీసుకెళ్లేందుకు నిమ్మగడ్డ సిద్ధమవుతున్నారు. దేశం మొత్తం అన్ని చోట్లా ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగుల పేరు చెప్పి.. వారిని రెచ్చగొట్టి.. ఎన్నికల నిర్వహణకు అడ్డు పడుతున్నారని.. ఎస్ఈసీ వాదించే అవకాశం ఉంది. రాజ్యాంగ సంస్థ అయిన ఎస్ఈసీకి ఎన్నికల నిర్వహణకు సహకరించకపోతే.. తీవ్రమైన విషయంగా పరిగణిస్తారు. అది దుష్ట సంప్రదాయానికి దారి తీస్తుంది. ప్రజాస్వామ్య పునాదుల్నే కలిదిస్తుంది. అందుకే.. ఎస్ఈసీ వర్సెస్సర్కార్ వ్యవహారం … దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.