ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో కానీ ప్రభుత్వ పెద్దల సమయం అంతా ఇతరులపై కేసులు పెట్టడం… తమ కేసుల విషయంలో ఏం చేయాలో అని ఆలోచించడానికే సమయం సరిపోతోంది. పరిపాలనపై దృష్టి పెట్టిందే లేదు. నాలుగేళ్లుగా ఇదే తంతు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రావడానికి చేసిన విన్యాసాలు ఇప్పుడు మెడకు చుట్టుకుంటూడటంతో వాటిని తప్పించుకునేందుకు పూర్తి సమయం కేటాయిస్తున్నారు. పరిపాలనా అనేదే ఉండటం లేదు. బటన్ నొక్కడానికి సమయం లేకపోతే.. ఆ నిధుల్ని ఆపేస్తున్నారు కానీ పంపిణీ చేయడం లేదు.
సీఎం సమయం అంతా కేసులు.. కుట్రలతో సరి !
మార్గదర్శిని ఎలా ముంచేద్దామని.. ఉన్నత స్థాయి సీక్రెట్ సమావేశాలు నిర్వహిస్తారు. సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తల్ని ఎలా కంట్రోల్ చేయాలి.. ఎవర్ని అరెస్ట్ చేయాలి.. ఏ పద్దతిలో అరెస్టు చేయాలి.. వారిపై ఎలాంటి ప్రచారం చేయాలి అన్నదానిపై గంటల తరబడి చర్చిస్తారు. ఇక సీబీఐ కేసుల్లో కోర్టుల్లో ఏ వాదనలు వినిపించాలి… అఫిడవిట్లు ఏమని దాఖలు చేయాలో చర్చిస్తారు. చివరికి లాబీయిస్టులతో రోజంతా చర్చలు కూడా జరుపుతారు. సమయం అంతా దీనికే సరిపోతోంది…కానీ పరిపాలనపై దృష్టి పెట్టే అవకాశమే లేకుండాపోతోంది.
పడకేసిన పాలన – జగనన్నకు చెప్పుకోలేని దుస్థితి !
రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది. సలహాదారులకు పాలనను వదిలేశారు. ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. అసలు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఆఫీసుకు వచ్చి .. పనులు చేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నారు. సర్పంచ్లదీ అదే తీరు. సమస్యల పరిష్కారం కోసం వస్తారని సీఎం క్యాంప్ ఆఫీసును గత నాలుగేళ్లుగా నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. చివరికి 13వ తేదీ నుంచి జగనన్నకు చెప్పుకుందాం అనే కాల్ సెంటర్ ను ప్రారంభిస్తామన్నారు. దాని గురించి సౌండ్ లేదు. కనీసం వాయిదా వేసినట్లుగా ప్రకటన లేదు. ఇప్పుడు అసలు ఆ ఊసే లేదు.. ఎందుకంటే…. సీఎం జగన్ వివేకా హత్య కేసు, కోడికత్తి కేసుల కసరత్తులో బిజీగా ఉన్నారు.
ఏపీకి ఇదేం ఖర్మ !
ఏపీ మొదటి సర్కారులో ఎప్పుడు చూసినా అభివృద్ధిపై చర్చ జరిగేది. రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడేవారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి .. చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వం మాట్లాడేది. వచ్చే పరిశ్రమలు.. రావాల్సిన పరిశ్రమలు… గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల అభివృద్ధి వంటి వాటిపై చర్చ జరిగేది. కానీ ఇప్పుడు అసలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చే లేదు. టీడీపీ నేతలపై కేసులు.. మీడియాపై కేసులు… కుట్రలు.. తమపై కేసుల్ని ఎలా రక్షించుకోవాలా అన్న ఎజెండానే. అందుకే ఏపీకి ఇదేం ఖర్మ అనుకోక తప్పదు.