ఏపీ సర్కార్ నిర్మిస్తుందో లేదో తెలియని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను తెలంగాణ సర్కార్ పక్కాగా ఉపయోగించుకుంటోంది. ఆ పనుల్నిసాకుగా చూపి.. శ్రీశైలంప్రాజెక్టుకు వస్తున్నప్రతి చుక్క నీరును ముందుగానే వినియోగించుకుంటోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వస్తోంది.వచ్చిన వరద నీటిని కరెంట్ ఉత్పత్తికి తెలంగాణ వినియోగించుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కు సంబధించి తెలంగాణకు ఎడమ విద్యుత్ కేంద్రం దక్కింది. శ్రీశైలంలో దండిగా నీరున్నప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. కానీ.. ఇప్పుడు వరద ప్రారంభం కాక ముందే.. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.
దీంతోవిద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్న నీటిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. ఏపీ లేఖకు స్పందిస్తూ తక్షణమే ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి.. నీటిని నిలిపివేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థలకు కృష్ణాబోర్డు ఆదేశించింది. కానీ తెలంగాణ సర్కార్ లైట్ తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న జల విద్యుత్ ద్వారా 100 శాతం ఉత్పత్తి చేయాలని.. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ఏపీ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల్ని కృష్ణాబోర్డు నిలువరించనప్పుడు.. తామెందుకు.. ఆ బోర్డు ఆదేశాలు పాటించాలన్నట్లుగా తెలంగాణ సర్కార్ శైలి ఉంది. ఇప్పటికే కృష్ణానీటిని దిగువకు రాకుండా కొత్త ప్రాజెక్టులు కడతామంటూ.. సర్వే కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కృష్ణాబోర్డును లైట్ తీసుకుని.. తమ ఇష్టారాజ్యంగా… చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది మరింత గందరగోళానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ టూల్గా… నీటి అంశం మారడంతోనే ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి.