ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు రాజకీయాలకు ఎలాంటి హద్దులూ లేవన్న అభిప్రాయం.. ప్రజల్లో బలపడుతోంది. అలా కావడానికి..ప్రభుత్వం… అధికారులు తీసుకుంటున్న చర్యలే కారణంగా కనిపిస్తున్నాయి. కరకట్టపై ప్రజావేదికను కూల్చేసిన తర్వాత చంద్రబాబును ఇంటికిని ఖాళీ చేయిస్తామని.. వైసీపీ నేతలు అదే పనిగా హెచ్చరికలు చేశారు. ఆ క్రమంలో నోటీసులు ఇచ్చారు. ఇక … గ్రామాల్లో జరుగుతున్న రాజకీయ దాడులు… హత్యలు రోజూ హెడ్ లైన్స్ అవుతూనే ఉన్నాయి. అదే సమయంలో.. టీడీపీ నేతల ఆస్తులే టార్గెట్గా… ఉల్లంఘనల పేరుతో నోటీసులు జారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల కూలగొడుతున్నారు. విశాఖలో గంటా ఇల్లు , మురళీమోహన్ కు చెందిన జయభేరీ సంస్థలకు చెందిన భవనాలను… కూలగొట్టారు కూడా. ఇప్పుడు.. టీడీపీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారంలో ఉన్న మీడియా సంస్థలపైనా గురి పెట్టినట్లుగా కొన్ని ఉదాహరణలు బయటకు వస్తున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని పాలచర్ల గ్రామంలోని ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ ఉన్న భవనానికి..అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆంధ్రజ్యోతి కొత్తగా ప్రింటింగ్ ప్రెస్ను పాలచర్లలో ప్రారంభించింది. అది ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభమయింది. ఇప్పుడా భవనం అక్రమం అని.. వారం రోజుల్లో తొలగించాల్సిందేనని.. నోటీసులు ఇచ్చారు. గోదావరి అర్బన్ డెలవప్మెంట్ అథారిటీ, పంచాయతీ అనుమతులు తీసుకోలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే డీటీసీపీ పర్మిషన్ కూడా లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయరోడ్డు నిర్మించాల్సి ఉన్నా నిర్మించలేదని..వారం రోజుల్లో వివరణ ఇచ్చి.. అక్రమ కట్టడాన్ని తొలగించాలని.. లేకపోతే.. తొలగిస్తామని.. ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ప్రత్యేకించి కొంత మందిని టార్గెట్ చేసుకుని మాత్రమే ఇలా.. నోటీసులు రావడం.. చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. నిజానికి అటు.. కరకట్టపై నివాసాలు కానీ.. ఇతర ఆక్రమణల పేరుతో కూలగొట్టిన భవనాలు కానీ..నోటీసులు అందించిన భవనాలు కానీ…నిబంధనలకు విరుద్ధమైతే.. అలా ఉన్న భవనాలన్నింటికీ ఒకే రకమైన ట్రీట్ మెంట్ ఇవ్వాలి. కానీ.. కొంత మందిని మినహాయించి.. కేవలం కొంత మందినే టార్గెట్ చేసుకోవడంతో.. కక్ష సాధింపులన్న అభిప్రాయం బలపడుతోంది. ఇదే అభిప్రాయం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తే ప్రభుత్వానికి కూడా ఇబ్బందే అవుతుంది.