హైదరాబాద్: ‘ఆంధ్రజ్యోతి’కి సుప్రీంకోర్ట్‌లో విజయం లభించింది. ‘ఏబీఎన్’ ఛానల్‌పై తెలంగాణలో కొనసాగుతున్న అప్రకటిత నిషేధాన్ని ఎత్తేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలిచ్చింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఎమ్ఎస్ఓలు తక్షణమే పునరుద్ధరించాలని సుప్రీంకోర్ట్ త్రిసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. టీవీ 9 విషయంలో టీడీశాట్ ఇచ్చిన ఆదేశాలను ఏబీఎన్ విషయంలోకూడా అమలుచేయాలని, అవసరమైతే కేబుల్ ఆపరేటర్లకు తెలంగాణ ప్రభుత్వమే రక్షణ కల్పించాలని ఆదేశాలలో పేర్కొంది. కోర్ట్ తీర్పుపై జర్నలిస్ట్ సంఘాల నాయకులు, ప్రతిపక్షాల నేతలు హర్షం వ్యక్తంచేస్తూ ఇది కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అభివర్ణించారు.
దాదాపు 500 రోజులపైగా ఏబీఎన్ ఛానల్‌పై నిషేధం కొనసాగింది. తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ప్రమాణస్వీకారం చేసేటపుడు పొరపాట్లు చదవటంపై టీవీ 9, ఏబీఎన్ వ్యంగ్య కార్యక్రమాలు ప్రసారం చేసింది. దీనిపై ఆగ్రహించిన కేసీఆర్, ఆ రెండు ఛానల్స్‌పై ఉక్కుపాదం మోపారు. ఆ రెండు ఛానల్స్ ప్రసారాలను నిలిపేయాలని ఎమ్ఎస్ఓలను ఆదేశించారు. ఇష్టమొచ్చినట్లు రాస్తే ఎవరినీ లెక్కచేయనని, తాను హిట్లర్ కంటే చెెడ్డవాడినని, మెడలు విరిచి భూమికి పది కిలోమీటర్ల అడుగున పాతేస్తాననికూడా హెచ్చరించారు. అయితే టీవీ 9 ఛానల్ కొద్ది నెలలక్రితం టీడీశాట్ ఆదేశాలద్వారా తమ ప్రసారాలను పునరుద్ధరించుకుంది.ఆంధ్రజ్యోతికి ఇవాళ్టికి మోక్షం కలిగింది. తెలంగాణలో నిషేధం విధించటంవలన కోల్పోతున్న ఆదాయానికి పరిహారంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాల కాంట్రాక్ట్‌ను చంద్రబాబు ఇచ్చారని ఒక వాదన ప్రచారంలో ఉంది. మరోవైపు ఇవాళ్టి తీర్పు నేపథ్యంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం, సిబ్బంది ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏబీఎన్ ఛానల్లో మిగిలిన ప్రసారాలన్నీ ఆపేసి సుప్రీమ్ కోర్ట్ తీర్పుపై ప్రతిపక్ష నేతలు, కేసీఆర్ వ్యతిరేకుల స్పందనల బైట్లతో ఊదరగొడుతున్నారు.
ఇదిలాఉంటే, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై విచారణకు ఇవాళ రంగారెడ్డిజిల్లా కోర్ట్ ఆదేశాలిచ్చింది. అవిభక్త కవలలు వీణ-వాణిల పేరిట విరాళాలు సేకరించి బాధితులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని పేర్కొంటూ జనార్దన్ గౌడ్ అనే న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్ స్వీకరించిన కోర్ట్ రాధాకృష్ణపై ఈనెల 16వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఐపీసీ 406, 420, 120(బి) సెక్షన్లకింద కేసు నమోదు చేయాలని సూచించారు. కేసీఆర్ సహారా గ్రూప్‌కు నిబంధనలకు విరుద్ధంగా సాయపడ్డారని ఆంధ్రజ్యోతి ఇటీవల కథనం రాయటంతో ఆగ్రహించిన నమస్తే తెలంగాణ – వీణ-వాణిల వ్యవహారాన్ని బయటకు తీసింది. విరాళాలన్నింటినీ ఆంధ్రజ్యోతి స్వాహా చేస్తోందని ఆరోపించింది. దీనిపై ఆంధ్రజ్యోతి వివరణ ఇచ్చిందికానీ అది సహేతుకంగా, బలంగా లేదు. ఇలాంటి సమయంలో ఏబీఎన్‌పై సుప్రీంకోర్ట్ తీర్పు రావటం రాధాకృష్ణకు మంచి ఊరటనిచ్చిందని చెప్పొచ్చు.