కరోనా నుంచి కాపాడుకోవాలంటే శానిటైజర్లతో చేతులు కడుక్కోవాలి. కరోనా భయానికి శానిటైజరే పెద్ద ఉపాయం. ఇప్పుడు కరోనా బారిన పడిన నష్టపోతున్న పత్రికా రంగం కూడా.. తమను కాపాడుకునేందుకు శానిటైజర్లను వాడేసుకుంటున్నాయి. శానిటైజ్ న్యూస్ పేపర్లను తెరపైకి తెస్తున్నాయి. వినడానికి కాస్త చిత్రంగా ఉన్నా.. ఇది నిజం. తెలుగులో.. ఆంధ్రజ్యోతి పత్రిక తొలి సారి శానిటైజ్ న్యూస్ పేపర్లను మార్కెట్లోకి తెస్తున్నట్లుగా ప్రకటన చేసింది. విస్తృతంగా ప్రచారం కూడా చేస్తోంది. ఇప్పుడంతా కరోనా భయం. చికెన్ తింటే కరోనా వస్తుందని జరిగిన ప్రచారంతో పౌల్ట్రీ పరిశ్రమ ఎలా సంక్షోభంలో కూరుకుపోయిందో… దినపత్రికలపైనా అదే తరహా ప్రచారం జరిగింది.
న్యూస్ పేపర్లపై కరోనా వైరస్ ఎక్కువ కాలం ఉంటుందన్న ప్రచారం జరగడంతో.. ప్రజలు పత్రికలను పట్టుకోవడానికి భయపడిపోతున్నారు. ఈ కారణంగా… కొన్నాళ్ల పాట్లు పేపర్ ప్రింటింగ్‌ను ఆపేయాలని.. పత్రికా యాజమాన్యాలు ఆలోచించాయి. అయితే.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో.. అత్యంత విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు చేరే వేస్తోంది ప్రింట్ మీడియానేనని… ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పడమే కాదు.. పత్రికలకు అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. దాంతో.. ఆయా పత్రికల యాజమాన్యాలు… ప్రింటింగ్‌ను కొనసాగిస్తున్నాయి. పత్రికల వల్ల కరోనా రాదని ప్రచారం ప్రారంభించాయి. కొత్తగా.. ఆంధ్రజ్యోతి దినపత్రిక మరో కాన్సెప్ట్ ను కనిపెట్టింది. అదే శానిటైజ్డ్ న్యూస్ పేపర్.
తన దినపత్రిక పూర్తిగా శుభ్రంగా ఉంటుందని..తమని శానిటైజ్డ్ న్యూస్ పేపరని.. పాఠకులు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. తమ పత్రికను చేతుల్తో పట్టుకుని చదవవచ్చని ప్రకటించేస్తోంది. ఇంతకీ శానిటైజ్ చేయడం అంటే… కలర్స్‌లో శానిటైజర్ కలుపుతారా..? ప్రింటింగ్ అయిన తర్వాత వాటిపై శానిటైజర్లు చల్లుతారా.. అన్నదానిపై క్లారిటీ లేదు.. ఆంధ్రజ్యోతి కూడా చెప్పలేదు. కానీ ఎలాంటి వైరస్లు ఉండని పత్రిక అని చెప్పుకునేందుకు శానిటైజ్ అనే మాటను అలా వాడేసుకుంటుందన్న అభిప్రాయం మాత్రం చాలా మందిలో కలుగుతోంది.