ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ.. తన వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో ఏపీలో ఇంగ్లిష్ మీడియంపై.. తన అభిప్రాయాలన్ని.. నిక్కచ్చిగానే వెలిబుచ్చారు. తెలుగు దినపత్రిక నడుపుతున్న అధినేతగా.. ఆయన ఇంగ్లిష్ మీడియంను ఏ మాత్రం ఆహ్వానించలేరు. తెలుగు జర్నలిస్టుగా… తెలుగు చదవని, రాయలేని జనరేషన్‌ను చూడలేరు. ఈ పరిస్థితి ఆయనకే కాదు.. చాలా మందికి ఉంది. ఈ విషయం పక్కన పెడితే.. అసలు ఇంగ్లిష్ మీడియం వెనుక ఉన్న అసలు కోణం.. మాత మార్పిళ్లేనని అనుమానం వ్యక్తం చేశారు. దాని కోసం.. సుదీర్ఘ విశ్లేషణ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవులు గంపగుత్తగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటున్నారు. దళితులు, గిరిజనులలో అత్యధికులు క్రైస్తవ మతంలోకి మారారు. బీసీలను కూడా మతమార్పిడి చేయిస్తే రాజకీయంగా తాను మరింత బలపడతానని జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని ఆర్కే విశ్లేషణ. ఇదే విషయాన్ని కొన్నాళ్ల కిందట.. కొత్తపలుకులోనే చెప్పారు కూడా. పేదప్రజలకు మేలుచేయడం కోసమని చెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడితే బీసీలను కూడా క్రైస్తవ మతంలోకి సులువుగా మార్చవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నారని.. ఆర్కే చెబుతున్నారు. ఇంగ్లీష్ మీడియం బోధన వల్ల బాల్యం నుంచే పిల్లలను క్రైస్తవ మతంవైపు ఆకర్షించడం సులువు అవుతుందని గత అనుభవాలు చెబుతున్నాయన్నారు. కనీస ఆలోచన లేకుండా… ఉపాధ్యాయ సామర్థ్యం లేకుండా… ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం వల్ల పేద బాలల భవిష్యత్తే పాడవుతుంది. ఈ విషయాన్ని కూడా ఆర్కే వివరించారు. ఇతర భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో లేని దుస్థితి ఏపీకి వచ్చిందని ఆర్కే.. ఆవేదన చెందారు.
రాజధాని అవసరం లేదన్నట్లుగా ఏపీ ప్రజలు ఉండటం పై కూడా.. ఆర్కే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కోసం.. తెలంగాణ ప్రజల అంత కొట్లాడితే.. తమ సొంత రాజధానికి అస్థిత్వం కోసం.. ఏపీ ప్రజలు కనీసం ఆలోచన చేయడం లేదని ఆయన తేల్చారు. కులాల కుంపటి పెట్టి.. పబ్బం గుడుపుకుని…రాజకీయ లాభం చూసుకుని.. ఏపీ ప్రజల్ని.. జగన్.. ఆర్థికంగా కుంగిపోయేలా చేస్తున్నారన్న అభిప్రాయం కొత్తపలుకులో ఆర్కే వెల్లడించారు. ఉన్న ఆస్తులన్నీ.. తెగనమ్ముకుంటే.. మిగిలేది.. దివాలా పొజిషనేనని… అంతిమంగా నిర్ణయించారు. విద్యావంతులు, మేధావులు మాట్లాడనంత కాలం..ఏపీ పరిస్థితి బాగుపడదని తేల్చేశారు.