తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు… సాక్షి పత్రిక ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యేలపై గురి పెట్టింది. ఒక్కో ఎమ్మెల్యే వెయ్యి, రెండు వేల కోట్లు సంపాదించారంటూ… నియోజకవర్గంలో ప్రతి ఒక్కరినీ పీడించి.. వసూళ్లు చేశారని.. ప్రత్యేక పేజీల మీద పేజీలు ప్రచురిస్తూ.. వచ్చింది. వాటిపై.. టీడీపీ ఎమ్మెల్యేలు నిరూపించాలని చాలెంజ్‌లు చేయడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ప్రజల్లో మాత్రం చర్చకు కారణం అయింది. ఆ ఎమ్మెల్యే.. ఇలా చేశారట.. అలా చేశారట.. అనే పుకార్లకు కొదువ లేకుండా పోయింది. అంతిమంగా అది.. వారి ఓటమికి కారణం అయింది. ఇప్పుడు… ఆంధ్రజ్యోతి పత్రిక కూడా.. అదే తరహా ప్రచారాన్ని ప్రారంభించేసినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఆవురావురు మంటున్నారని.. ఇప్పటికే వసూళ్లు ప్రారంభించారని… కథనాలు ప్రారంభించేసింది.
ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన పేజీలో… “అమ్మో.. ఆ ఎమ్మెల్యేలు ” ఓ భారీ కథనమే రాసింది. ఇందులో ఏ ఎమ్మెల్యే పేరు చెప్పలేదు కానీ.. రాజకీయాలపై అవగాహన ఉన్న వారందరికీ.. ఆ ఎమ్మెల్యేలు ఎవరెనే విషయం అర్థమయ్యేలా.. వారి వసూళ్ల వ్యవహారాలను వెల్లడించింది. నియోజకవర్గంలో వ్యాపారాలు చేసుకోవాలంటే.. కప్పం కట్టాల్సిందేనన్నట్లుగా.. ఆ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నతీరును వివరించింది. నిజానికి .. కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. చాలా రోజుల తర్వాత అధికారం చేతికి వచ్చిందనే ఆతృతలో… వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి పనికి అయినా.. కొంత రేటు కడుతున్నారని అంటున్నారు. నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య రగడ కూడా.. లేఔట్‌కు సంబంధించిన వసూళ్ల వ్యవహారంలో బయటకు వచ్చిందే. దీంతో.. వైసీపీ ఎమ్మెల్యేలు నిజంగానే వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలనే ఆలోచన… ప్రభుత్వం చేస్తోంది. ఈ క్రమంలో.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే వ్యూహంతోనే… ఆంధ్రజ్యోతి పత్రిక ఇలాంటి కథనాలు ప్రారంభించినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇలా వసూళ్లు ప్రారంభించకపోతే.. ఏ సమస్యా ఉండకపోవచ్చు కానీ.. నిజంగానే వాళ్లు.. అధికారం అండతో ప్రజల వద్ద నుంచి వసూళ్లు ప్రారంభిస్తే మాత్రం.. వ్యతిరేకత ఇప్పటి నుంచి పెరిగిపోయే ప్రమాదం ఉంది.