ప్రభుత్వం – ఎస్ఈసీ మధ్య ఇప్పుడు చిటపటలు లేవు. ప్రభుత్వం ఏమనుకుంటే అది చేయడానికి ఏస్ఈసీ సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం ఎస్ఈసీ కూడా రెడీ అయ్యారు. ఎన్నికల ప్రక్రియను రద్దు చేయకుండా…. ఎక్కడ ఆగిపోయిందో అక్కడినుంచే కొనసాగించాలని వైసీపీ కోరుతోంది. దానికి తగ్గట్లుగా నిమ్మగడ్డ మున్సిపల్ ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు.. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల విషయంలోనూ ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే.. పరిషత్ ఎన్నికలకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే న్యాయపరమైన అంశాలపై ఆయన … నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది.
అయితే.. ఎన్నికలు నిర్వహించాలనుకుంటే… ఆ అంశం అడ్డంకి కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తూ ఉండటమే దీనికి ఉదాహరణ. అయితే… పరిషత్ ఎన్నికలను కూడా… నిమ్మగడ్డ ఎక్కడ ఆగిపోయిందో.. అక్కడ్నుంచే ప్రారంభిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాడులు, దౌర్జన్యాలతో అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు అయ్యాయని… స్వయంగా నిమ్మగడ్డ. లెక్కలతో సహా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వాటిని ఆయన కొనసాగిస్తే.. విధి నిర్వహణలో ఆయన రాజీ పడినట్లుగా అవుతుంది.
అందుకే ఆసక్తి ఏర్పడింది. కొత్త నోటిఫికేషన్ ఇస్తే న్యాయపరంగా ఏమైనా చిక్కులు వస్తాయా అన్నదానిపై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మార్చి 31న నిమ్మగడ్డ రిటైర్ అవుతున్నారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వదల్చుకుంటే.. మార్చి పధ్నాలుగోతేదీన ఇస్తే… ఆయన పదవి కాలం పూర్తయ్యే లోపు ఎన్నికలు నిర్వహించవచ్చు. లేకపోతే… ఎన్నికలప్రక్రియ మధ్యలో ఆయన రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. నిమ్మగడ్డ ఏంచేస్తారన్నది ఇప్పుడు అటు వైసీపీ.. ఇటు టీడీపీ నేతల్లోనూ ఆసక్తి రేపుతోంది.