ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుండి…? సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండి అందరూ అడుగుతున్న ప్రశ్నే. తెలంగాణలో కొత్త సర్కార్ రాగానే వారంలో మొదలుపెట్టారు… ఏపీలో ఇంకెప్పుడు అంటూ ప్రజలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
ఏపీలో ఫ్రీ బస్ స్కీం అమలుకు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సర్కార్ పరిశీలన మొదలుపెట్టింది. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విధివిధానాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, కర్ణాటక స్కీంకు తెలంగాణ స్కీంకు తేడా ఉందా అన్న అంశాలపై సీఎం చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
అయితే, ఫ్రీగా మహిళల బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుండి ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి రవాణా శాఖ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఏపీ ఆర్టీసీ బస్సులో… రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా ఎక్కడి వరకు అయినా ఏపీకి చెందిన మహిళలకు ఉచిత సదుపాయం కల్పించబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
మహిళలందరికీ సీఎం చంద్రబాబు కానుకగా ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రాబోతుండగా… అందుకు ఎంత ఖర్చవుతుందో ఆర్టీసీకి ప్రభుత్వం బకాయిలు చెల్లించబోతుంది.