ప్రజలు ఇచ్చిన అధికారంతో వారినే భయ పెట్టి బానిసలుగా చేసుకుని నియంతగా మారిపోవాలనుకున్న వారికి చివరికి ఏ గతి పట్టిందో చరిత్రలో చాలా మంది ఉదాహరణలుగా ఉన్నారు. అయినా వారినే ఆదర్శంగా తీసుకుని పాలన చేసే వారు మాత్రం ఎప్పుటకిప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నారు. వారి విషయంలో చరిత్ర పునరావతృతమవుతుంది. భయ.పడినంత కాలం భయపడతారు.. తర్వాత భయపెడతారు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వానికి అంగన్వాడిలు కూడా భయపడటం లేదు.
అంగన్వాడిలు జగన్ రెడ్డి ఇచ్చిన హామీల అమలు కోసం రోడ్డెక్కిన తర్వాత ప్రభుత్వం చేయని అధికార దుర్వినియోగం లేదు. హెచ్చరించారు.. బెదిరించారు.. లాఠీలు ప్రయోగించారు.. అరెస్టులు చేశారు. చివరికి ఎస్మా ప్రయోగించారు. ఉద్యోగాల నుంచి తీసేస్తామన్నారు. కానీ అంగన్వాడిల్లో ఇసుమంత కూడా భయం లేకపోగా… బటన్ నొక్కే ఆప్షన్ తమకూ ఉందని హెచ్చరికలు పంపుతున్నారు. ఆర్భాటంగా ఎస్మా ప్రయోగించినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉండిపోయింది.
అధికారం అంతానికి చేరిందని ప్రజలకూ అర్థమైపోయింది. ఇంత కాలం బెదిరించి తొక్కిపెట్టిన అసంతృప్తి ఒక్క సారిగా బయటకు రాబోతోంది. మీడియాలో చేసుకునే ప్రచారం ప్రజల్ని మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇంకా మరెన్నో రోజులు లేదు.. రెండు నెలలే అన్న భరోసా ఎక్కువ మందిలో కనిపిస్తోందంటే… ఈ ప్రభుత్వం తమ పతనానికి ఎంత ఘోరమైన స్క్రిప్ట్ రాసుకుందో సులువుగా అర్థమైపోతుంది.