ఎస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీ డైరక్టర్లు ఏసీబీ ఎదుట హాజరయ్యారు. అందులో ఒకరు చలమలశెట్టి అనిల్. ఈయన చిన్న వ్యక్తి కాదు. గ్రీన్ కో కంపెనీ ఓనర్. కొన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి. ఫార్ములా ఈ రేసు స్పాన్సర్ షిప్ కోసం ఓ కంపెనీని 2022లో ప్రారంభించి ఒప్పందం చేసుకుని.. నష్టాలు వచ్చాయని వెంటనే డ్రాప్ అయ్యారు . ఇదంతా ఓ గూడుపుఠాణి అని క్లియర్ గా తెలియడంతో ఏసీబీ అధికారులు మెల్లగా పట్టు బిగిస్తున్నారు. ఈ క్రమంలో వారిని ఏసీబీ అధికారులు విచారించారు.
ఎస్ నెక్ట్స్ జెన్ ఏర్పాటు చేసిన ఉద్దేశం.. వందల కోట్లతో ఎలా స్పాన్సర్ షిప్ చేయాలనుకున్నారో ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అయితే ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కోసమే.. వారు అడిగారనే తాము స్పాన్సర్ షిప్ చేశామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అవి ఎలాంటి సంబంధాలు అన్నది కూడా ఆరా తీశారు. నష్టాలు వచ్చాయని స్పాన్సర్ షిప్ ఉపసంహరించుకుంటే.. రూ. 41 కోట్లు ఎందుకు బీఆర్ఎస్ కు అదే సమయంలో ఎలక్టోరల్ బాండ్లుగా చెల్లించారన్నదానిపైనా అనిల్ చలమలశెట్టి కీలక విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వాన్ని ఒంటి చేతుల్లో నడిపిన వ్యక్తిగా కేటీఆర్ కు పారిశ్రామిక వర్గాల్లో అప్పట్లో చాలా పరిచయాలు ఉండేవి. మిత్రులు అయ్యారు. అయితే అవన్నీ రాజకీయ అధికారంతో వచ్చి పడిన స్నేహాలు. ఇప్పుడు అనిల్ చలమలశెట్టికి తన వ్యాపారాలు కీలకం. కొన్ని వేల కోట్లు అందులో ఇమిడి ఉన్నాయి. అందుకే ప్రభుత్వంతో బలపడేందుకు లేకపోతే..తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉండదు. కేటీఆర్ ను ఇరికించడానికి అవసరమైన సమాచారాన్ని ఆధారాలను ఏసీపీకి ఇచ్చే ఉంటారని అంచనా వేస్తున్నారు.