ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీకి కరణం మల్లీశ్వరి వైస్ చాన్సలర్ అయినట్లుగా ఏపీ స్పోర్ట్స్ యూనివర్శిటీకి దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే వీసీ కానున్నారా..?. అసలు నిన్నటిదాకా.. ఆ మాటకొస్తే ఈ రోజు మధ్యాహ్నం వరకూ అంటే.. అనిల్ కుంబ్లే .. అమరావతికి వచ్చి ఏపీ సీఎం జగన్తో భేటీ అయ్యే వరకూ.. ఏపీలో అసలు స్పోర్ట్స్ యూనివర్శిటీ ఉందని కానీ.. పెట్టే ఆలోచనలో ఉన్నారని కానీ తెలియదు. కానీ అనిల్ కుంబ్లే వచ్చి భేటీ అయి వెళ్లిన తర్వాత.. ఒక్క సారిగా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రచారం ఊపందుకుంది. ఏపీలో స్పోర్ట్స్ యూనివర్శిటీ పెడితే తన వంతు సహకారం అందిస్తానని కుంబ్లే సీఎంకు చెప్పినట్లుగా సీఎంవో అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు.
అంతేకాక క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీని పెట్టే అంశంపైనా దృష్టిసారించాలని ఆయన సీఎంను కోరారు. ప్రస్తుతం జలంధర్, మీరట్ లాంటి నగరాలనుంచే అన్నిరకాల క్రీడా సామగ్రిని తెచ్చుకుంటామని, ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో క్రీడా సామగ్రి ఉంటుందని కుంబ్లే సీఎం కు వివరించినట్లుగా తెలిపారు. దీనికి సంబంధించి తన అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నానని కుంబ్లే జగన్కు హామీ ఇచ్చారు. అంటే.. అటు స్పోర్ట్స్ యూనివర్శిటీ వీసీ గా అయినా రావాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ.. ప్రభుత్వం తరపున కానీ పెట్టబోయే క్రీడా పరికరాల ఫ్యాక్టరీ కోసం అయినా వచ్చి ఉండాలి.
ఊరకనే రారు మహానుభావులు అని.. కుంబ్లే వచ్చి కలిశారు కాబట్టి.. దానికి సంబంధించిన అడుగులు.. ముందు ముందు పడే అవకాశం ఉంది. స్పోర్ట్స్ యూనివర్శిటీ పెట్టాలంటే ప్రభుత్వానికి చాలా ఖర్చవుతుంది. అదే ఫ్యాక్టరీ అయితే ప్రైవేటు వ్యక్తులతో పెట్టించేయవచ్చు. బహుశా.. కుంబ్లే ఈ విషయంపై మాట్లాడటానికి ఎక్కువ అవకాశం ఉందని భావిస్తున్నారు.