ఎఫ్ 3 పనుల్ని దాదాపుగా పూర్తి చేసేశాడు అనిల్ రావిపూడి. ఆ వెంటనే బాలకృష్ణతో సినిమా పట్టాలెక్కిస్తాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టులో అనిల్ రావిపూడి తలమునకలై ఉన్నాడని టాక్. ఈ సినిమా కథేంటి? అందులో బాలకృష్ణ పాత్రేమిటి? అనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి మాత్రం `ఈసారి పక్కా మాస్ సినిమా తీస్తా` అని ప్రకటించేశాడు. ఈ సినిమా లో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని ఓ ప్రచారం మొదలైంది. అనిల్ రావిపూడి తొలి సినిమా `పటాస్` పోలీస్ కథే. అందులో… హీరోని నెగిటీవ్ యాంగిల్ లో చూపించి, వినోదం పంచిపెట్టాడు. ఈసారీ.. అదే జోనర్లో అనిల్ రావిపూడి సినిమా తీయబోతున్నాడట. బాలయ్య ఇది వరకు చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపించాడు. అయితే రౌడీ ఇనస్పెక్టర్, లక్ష్మీ నరసింహా చిత్రాలలో బాలయ్య పోలీస్ పాత్రలు బాగా పండాయి. ఈ సినిమాలో పోలీస్ పాత్ర వాటికి మించిన స్థాయిలో ఉండబోతోందని టాక్. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. అది అవ్వగానే.. అనిల్ రావిపూడి సినిమా మొదలైపోతుంది.