పండగ రోజున కొత్త సినిమాల హంగామా ఓ రేంజులో ఉంటుంది. సంక్రాంతి అంటే… ఆ సంబరాలు మరింత ఎక్కువ. గత కొన్నేళ్లుగా సంక్రాంతికి టాలీవుడ్లో సినిమాలు వరుస కడుతున్నాయి. బాగుంటే అన్నీ ఆడుతున్నాయి కూడా. లేదంటే జనాలు పండగ పూట వచ్చిందని కూడా చూడకుండా తిప్పికొడుతున్నారు. 2019 సంక్రాంతి రేసుకి అప్పుడే కొన్ని సినిమాలు కర్చీఫ్‌లు వేసేసుకున్నాయి. బాలయ్య ప్రతిష్టాత్మక చిత్రం `ఎన్టీఆర్` సంక్రాంతికి వస్తున్నాడు. బాలయ్య సంక్రాంతి హీరో. పైగా ఓ అది ఎన్టీఆర్ బయోపిక్. కాబట్టి… ఆ సినిమాకి చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ఉంటాయి. మరోవైపు రామ్ చరణ్ – బోయపాటిల సినిమా కూడా సంక్రాంతికి వచ్చేస్తోంది. ఈ సినిమాని ఎలాగైనా సంక్రాంతికి సిద్దం చేయాలని బోయపాటి భావిస్తున్నాడు. సంక్రాంతికి ఇలాంటి మాస్ సినిమా ఒకటి తప్పకుండా ఉండాల్సిందే. పైగా రామ్ చరణ్ బోయపాటి కాంబో అంటే జనాలకు అంచనాలు ఓ రేంజులో ఉంటాయి.
ఈ రెండు సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఉంటుందనుకుంటున్న తరుణంలో… దాన్ని మరింత క్లిష్టతరం చేస్తూ… వచ్చే సంక్రాంతికి ‘ఎఫ్ 2’ని రంగంలోకి దింపనున్నాడు దిల్‌రాజు. వెంకీ, వరుణ్‌తేజ్‌లు కలసి నటిస్తున్న మల్టీస్టారర్ ఇది. టైటిల్‌ని బట్టి చూస్తే.. కచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనరే అనిపిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి అలాంటి సినిమాలే తీస్తాడు కాబట్టి… సంక్రాంతికి ఇంతకు మించిన ఆప్షన్ మరోటి ఉండదు. ప్రస్తుతానికి సంక్రాంతి కర్చీఫ్‌లు వేసుకున్న సినిమాలివే. రాబోయే రోజుల్లో మరిన్ని ఇందులో చేరొచ్చు. ఎన్ని చేరితే… ఈ పోటీ అంత మజాగా ఉంటుంది. చూద్దాం.. సంక్రాంతి ట్రైన్ ఎక్కే సినిమాలేమిటో..??