తెలుగులో ఫ్రాంచైజీ అనే విధానానికి ప్రాణం పోశాడు అనిల్ రావిపూడి. ఎఫ్ 2 హిట్టవ్వడంతో.. ఎఫ్ 3 వచ్చింది. ఆ సినిమా కూడా వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇప్పుడు ఎఫ్ 4కి రంగం సిద్ధం అవుతోంది. ఎఫ్ 2ని ఓ ఫ్రాంచైజీగా ఎప్పటికీ అలానే కొనసాగించాలన్నది అనిల్ రావిపూడి ఆలోచన. డబ్బులు వస్తున్నంత వరకూ ఈ క్రేజ్ తో ఎఫ్ 3, ఎఫ్ 4, ఎఫ్ 5…. ఇఆ తీస్తూనే ఉండాలన్నది దిల్ రాజు ఉద్దేశ్యం. ఎఫ్ 3కి డబ్బులు వచ్చేశాయి కాబట్టి, ఎఫ్ 4కి రంగం సిద్ధం చేసుకోవొచ్చు.
అయితే ఎఫ్ 4 ఇప్పట్లో లేదు. దానికి చాలా సమయం పడుతుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు. త్వరలో బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నారు అనిల్ రావిపూడి. ఆ తరవాత దిల్ రాజు ప్రొడక్షన్లో మరో సినిమా ఉంటుంది. అది ఎఫ్ 4 కాదు. మరో హీరోతో.. ఓ పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా చేస్తారు రావిపూడి. ఈ రెండు ప్రాజెక్టులూ అయ్యాకే ఎఫ్ 4 ఉంటుంది.
ఈ సీజన్లో వెంకటేష్, వరుణ్‌తేజ్‌లు కంటిన్యూ అవుతారు. కానీ తమన్నా, మెహరీన్ పాత్రలకు రిప్లేస్ మెంట్ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా అనిల్ రావిపూడి నర్మగర్భంగా చెప్పేశారు. “ఎఫ్ 4 రావడానికి మరో రెండేళ్లయినా పడుతుంది. ఈలోగా చాలా మార్పులు జరగొచ్చు. వెంకీ, వరుణ్‌లు అలానే కొనసాగుతారు. హీరోయిన్లు మారే అవకాశం ఉంది“ అని తేల్చేశారు. మరో రెండేళ్లకు తమన్నా స్టార్ డమ్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఎఫ్ 3లోనే మెహరీన్ ని చూడడం కష్టమైంది. మరో రెండేళ్లకైతే.. మెహరీన్‌ని తీసుకొనే ధైర్యం చేయకపోవొచ్చు. ఎఫ్ 2 కథకీ, ఎఫ్ 3 కథకీ సంబంధమే లేదు. కాబట్టి.. ఎఫ్ 4 కథ కూడా మారిపోతుంది. అప్పుడు కొత్త హీరోయిన్లని తీసుకోవడంలో తప్పేం లేదు. మరి ఆ స్థానం ఎవరికి దక్కుతుందో చూడాలి.