ఒక్క హిట్టు కొడితేనే వాళ్లని స్టార్ దర్శకుల రేంజులో చేర్చేస్తున్నారు. అలాంటిది వరుస విజయాలు సాధించుకుంటూ వెళ్తే, వంద కోట్ల సినిమా తీసిస్తే… ఇక ఆ దర్శకుడిపై కోట్ల జల్లు కురవడం ఖాయం. అనిల్ రావిపూడి విషయంలో అదే జరుగుతోంది. ఎఫ్ 2 విజయంతో అనిల్ రావిపూడి రేంజు పెరిగింది. ఇప్పుడు మహేష్‌తో సినిమా చేసే స్థాయికి ఎదిగాడు. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి అక్షరాలా పది కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు టాక్. అనిల్ రావిపూడి అందుకుంటున్న అత్యధిక పారితోషికం ఇదే. దిల్ రాజు బ్యానర్లో మూడు సినిమాలు చేశాడు అనిల్. ఆ మూడు సినిమాలకు కలిపి కూడా పది కోట్లు రాలేదు. అలాంటిది ఒక్క సినిమాతో జాక్ పాట్ కొట్టేసినట్టైంది.
మహేష్ బాబుకి దాదాపు 50 కోట్ల పారితోషికం ఇస్తున్నారు. అంటే దర్శకుడు, హీరో కలిపి రూ.60 కోట్లు పట్టుకెళ్లిపోతున్నారు. మరో 20 కోట్లలో ఈ సినిమా పూర్తి చేయాలన్నది లక్ష్యం. అంటే రూ.80 కోట్ల బడ్జెట్ ఈ సినిమా కోసం కేటాయించారన్నమాట. మహేష్ – అనిల్ రావిపూడి కాంబో అంటే.. మార్కెట్ లో క్రేజ్ రావడం ఖాయం. దానికి తోడు `మహర్షి` వసూళ్లు మంచి జోరుగా నడుస్తున్నాయి. మహేష్ సినిమా హిట్టయితే వంద కోట్ల క్లబ్లో చేరడం గ్యారెంటీగా మారింది. అందుకే నిర్మాతలు కూడా ఈ రేంజులో ఖర్చు చేయడానికి వెనుకంజ వేయడం లేదు.