ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా 5 సూపర్ హిట్లు. అందులో నాలుగు ఒకే బ్యానర్లో తీసిన సినిమాలు. రెండు వంద కోట్ల సినిమాలు. అందులో ఒకటి ఇండియన్ పనోరమాకి సెలెక్ట్ అవ్వడం.. నిజంగా ఇది సూపర్ హిట్ జర్నీ అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఆ దర్శకుడు ఎవరో కాదు.. అనిల్ రావిపూడి. జంథ్యాలు,పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమా తీయగల దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు కనిపిస్తుంది. `సరి లేరు నీకెవ్వరు` తో తనపై భరోసా మరింత పెరిగింది. ఇప్పుడు `ఎఫ్ 3` సినిమాతో బిజీగా ఉన్నారాయ. రేపు.. సోమవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడితో చిన్న చిట్ చాట్.
హలో అండీ.. అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్ డే..
– థ్యాంక్యూ అండీ..
ఎప్పుడు చూసినా ఫుల్ ఎనర్జీతో ఉంటారు…. ఏమిటారహస్యం?
– నా దృష్టిలో సినిమా అనేది ఓ స్వర్గం లాంటిది. స్వర్గంలో ఎవరైనా నీరసంగా ఉంటారా? ఇలా ఎనర్జిటిక్‌గానే ఉండాలి. ఓ కథ రాసుకుంటున్నప్పుడు, దానిపై వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఎనర్జిటిక్ గా ఉంటాను. సెట్లో అడుగుపెడితే అది డబుల్, త్రిపుల్ అవుతుంది.
డాన్స్ బాగా చేస్తారు, మీలో మంచి నటుడు కూడా ఉన్నాడు.. మరి హీరో ఎప్పుడు అవుతారు?
– నా దగ్గర చాలా కథలున్నాయి. అవన్నీ సినిమాలుగా తెరపై చూసుకుని `ఇక చాల్లేరా బాబు.. ` అనుకున్నపుడు ఆపేస్తా. అప్పుడు కావాలంటే నటుడిగా ట్రై చేసుకుంటాలెండి..
వరుసగా 5 హిట్లు కొట్టారు. ఓ దర్శకుడిగా ఇంతకంటే ఏం కోరుకోరేమో..?
– నిజంగానే లేదండీ… ఇది ఊహించని ఓ ప్రయాణం. వరుసగా ఇన్ని హిట్లు వచ్చాయంటే, అది నా ఒక్కడి ఘనత కాదు. నన్ను నమ్ముకున్న నిర్మాతలది, నా హీరోలది.
వరుసగా దిల్ రాజుతోనే ప్రయాణం చేస్తున్నారు కదా..
– అవును… ఓరకంగా ఆయన నన్ను దత్తత తీసేసుకున్నారు. `సుప్రిమ్` నుంచి ఆయనతో ప్రయాణం కొనసాగుతోంది. `మా బ్యానర్లో వచ్చిన సినిమాలన్నింటిలోనూ… ఎఫ్ 2నే ఎక్కువ లాభాల్ని తీసుకొచ్చింది` అని అన్నారాయన. అన్ని సినిమాలు తీసిన నిర్మాత, ఆ మాట అనడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఆయనతో నా ప్రయాణం ఇంకా ఇంకా కొనసాగుతుంది.
ఎఫ్ 3 ఎప్పుడు?
– డిసెంబరు 14 నుంచి షెడ్యూల్ మొదలవుతుంది. ఎఫ్ 2తో నాకెంత పేరొచ్చిందో.. దానికి మూడు రెట్లు ఎఫ్ 3తో వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. కొత్తగా పెళ్లయిన జంట జీవితంలో జరిగే చిన్న చిన్న తమాషాలను కథగా అల్లాను. ఓ రకంగా చెప్పాలంటే `క్షేమంగా వెళ్లి – లాభంగా రండి` సినిమానే నాకు స్ఫూర్తి. ఆ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎక్కడెక్కడ, ఏ సన్నివేశాల్లో ఎలా రియాక్ట్ అయ్యారో నాకు తెలుసు. కుటుంబ సమేతంగా చూసేలా ఓ కథ చెబుతూ, అందులో వినోదం జోడిస్తే, దానికి రీచ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ ఫార్ములాతోనే `ఎఫ్ 2` తీశాం.
మహేష్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు?
– ఆయన ఎప్పుడంటే అప్పుడు. పిలిస్తే చాలు… ఆయన ఇంటికి వెళ్లిపోవడానికి నేను రెడీ. ఆయన ఇంట్లో ఓ కుక్ ఉన్నారు. ఆయన స్నాక్స్ బాగా చేస్తారు. అవి తింటూ… ఇద్దరం పని మొదలెట్టేస్తాం.
‘గాలి సంపత్`తో నిర్మాతగానూ మారారు కదా?
– నా స్నేహితుడు ఎస్. క ష్ణతో ఇన్ని రోజులుగా నాతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. ఓ మంచి కథతో ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. `గాలి సంపత్` సినిమాను తన భుజాలపై వేసుకుని క ష్ణ నడిపిస్తున్నాడు. ఓ మిత్రుడిగా, నా వంతు క్రియేటివ్ సపోర్ట్‌ను అందిస్తూ స్క్రీన్‌ప్లే చేసి పెట్టాను. దర్శకుడిగా నేను చేస్తున్న సినిమాలతో పాటు సమాంతరంగా ఎస్. కృష్ణ బ్యానర్లోని సినిమాలకు నా క్రియేటివ్ సపోర్ట్ ఉంటుంది. సాయి నిర్మాణం అంటే.. తను నా మనిషి. తను చేసే సినిమాలకు నేను అన్ని విధాలుగా ఉంటాను.