హీరోలు పారితోషికాలతో పాటు, సినిమా లాభాల్లో వాటాలు అందుకుంటూ, రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో దర్శకులూ పయనిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ లో.. త్రివిక్రమ్ ప్రధాన వాటాదారుడు. రాజమౌళి సంగతి సరే సరి. ఆయనకు పారితోషికాలతో పనిలేదు. లాభాల్లో ఆయనకంటూ వాటా ఉంటుంది. కొరటాల శివ కూడా అంతే. `ఆచార్య` సినిమాని దాదాపు ఆయనే నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు… అనిల్ రావిపూడి కూడా అదే చేసినట్టు సమాచారం.
ఆయన నుంచి ఇప్పుడు ఎఫ్ 3 వస్తోంది. ఈనెల 27న విడుదల కానుంది. ఎఫ్ 2 తో పోలిస్తే… ఈ సినిమాకి బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. అయితే.. అనిల్ రావిపూడి మాత్రం పారితోషికం తీసుకోలేదట. లాభాల్లో వాటా కావాలని అడిగారట. అనిల్ రావిపూడి.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఆయనకు ఫ్లాపంటూ లేదు. ఇలాంటి దశలో అనిల్ ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అంటారు. కానీ.. ఎఫ్ 3కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకున్న అనిల్.. పారితోషికం కంటే, వాటానే బెటర్ అని భావించి ఉంటారు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చారు. ఎఫ్ 3 గనుక హిట్టయితే… దర్శకుడిగా రావిపూడి జాక్ పాట్ కొట్టినట్టే.