రాజమౌళి తరవాత అంత సక్సెస్ రేటు ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. వరుసగా ఏడు సినిమాలు హిట్టయ్యాయి. 8వ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. వెంకటేష్ తో అనిల్ రావిపూడికి ఇది మూడో సినిమా. ఎఫ్ 2, ఎఫ్ 3లు హిట్టయ్యాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతామన్న నమ్మకం అనిల్ రావిపూడిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా తెలుగు 360తో ప్రత్యేకంగా సంభాషించారు అనిల్ రావిపూడి. ఈ ఇంటర్వ్యూలో రావిపూడి చెప్పిన సంగతులు.
* వెంకటేష్ గారికి ఎప్పుడూ పూర్తి కథ నేరేట్ చేయలేదు. బిట్లు బిట్లుగా చెబుతా. ఆయనకు నాపై నమ్మకం. అనిల్ ఏదో మ్యాజిక్ చేస్తాడులే.. అని నా మీద వదిలేస్తారు. అయితే స్క్రిప్టు విషయంలో నేను అశ్రద్ద చేయను. ఓ మెడికల్ ఫార్ములా కనిపెట్టే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, నా కథని అంతే జాగ్రత్తగా రాసుకొంటా.
* వెంకటేష్ గారితో ఇది నా మూడో సినిమా. ఆయనతో నేను చాలా సినిమాలు చేస్తా. అంత కంఫర్ట్ జోన్ ఇచ్చారాయన. ఆయనలో ఓ పాజిటీవ్ వైబ్ కనిపిస్తుంటుంది. అందరితో చాలా చక్కగా మాట్లాడతారు. అబ్బాయి గారు, సుందరకాండ, నువ్వు నాకు నచ్చావ్, బొబ్బిలి రాజా.. నా ఫేవరెట్ సినిమాలు.
* రీ షూట్లూ, రీ రైట్లు నా సినిమాల్లో పెద్దగా కనిపించవు. సుప్రీమ్ కోసం ఓ సీన్ రీషూట్ చేసినట్టు గుర్తు. అంతకు మించి ఎప్పుడూ చేయలేదు. స్క్రిప్టు దశలో పక్కాగా ఉంటే రీషూట్లతో పని ఉండదు.
* వరల్డ్ బిల్డింగ్ అనే పెద్ద పెద్ద మాటలు నాకు తెలీవు. ప్రతీ సినిమాకూ ఓ వరల్డ్ ఉంటుంది. ఆ ప్రపంచంలోకి ప్రేక్షకుడ్ని తీసుకెళ్లడమే దర్శకుడి బాధ్యత.
* రమణ గోగులతో పాట పాడించడమే మా సక్సెస్ సీక్రెట్. పాట పాడమని ఆయన వెంట రెండు మూడు రోజులు తిరిగాడు భీమ్స్. పాటని రమణ గోగుల ఓన్ చేసుకొని పాడారు. భాస్కరభట్ల చాలా బాగా రాశారు. అందుకే ఆ పాటకు అంత రీచ్ వచ్చింది.
* ఆఖరి పాట నేను పాడతా అని నిజంగానే వెంకటేష్ గారు మా వెంట పడ్డారు. ఆయన ఎలా పాడతారో అని భయం వేసింది. కేవలం 25 నిమిషాల్లో పాట పాడేశారు.
* త్వరలో చిరంజీవిగారితో ఓ సినిమా చేస్తా. అది ఎలాంటి సినిమా, ఎప్పుడు చేస్తాం అనే విషయాల్లో డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలూ బాగా ఆడాలి. తెలుగు సినిమా కళకళలాడిపోవాలి.