చిత్రసీమలో హిట్ అనే పదమే అపూరూపం.. అపూర్వం. దాని కోసమే దర్శకులు, నిర్మాతలు, హీరోలు కలలు కంటుంటారు. ఓ హిట్.. చాలామంది జీవితాల్ని మార్చేస్తుంది. రాత్రికి రాత్రే స్టార్లు చేసేస్తుంది. హిట్ ముద్ర పడిన దర్శకులకు భలే డిమాండ్. ఆ దర్శకుడి ఇంటి ముందు నిర్మాతలు క్యూలు కట్టేస్తుంటారు. హిట్టు బొమ్మ మహిమ అదే. వరుసగా రెండు హిట్లు కొడితే టాప్ దర్శకుడు. మూడు, నాలుగూ.. అంటే ఇహ చెప్పక్కర్లెద్దు. అలాంటిది వరుసగా 8 హిట్టు సినిమాలు తీయడం అంటే మామూలు విషయం కాదు. ఇదో అరుదైన ఘనత. దాన్ని.. అనిల్ రావిపూడి సొంతం చేసుకొన్నారు.
పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకూ వరుసగా 8 హిట్లు సొంతం చేసుకొన్నాడు అనిల్ రావిపూడి. రాజమౌళి తరవాత.. ఆ ఘనత రావిపూడికే సొంతం. రాజమౌళి భారీ బడ్జెట్ సినిమాలు తీసి, తనకంటూ ఓ మార్క్ సెట్ చేస్తే.. రావిపూడి మినిమం బడ్జెట్ లో వేగవంతంగా సినిమాలు తీసి – తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకొన్నాడు. జంధ్యాల, ఈవీవీ తరవాత కామెడీ, ఎంటర్టైన్మెంట్స్ పట్టు తెలిసిన దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నారు. కమర్షియల్ మీటర్ కూడా తెలుసు కాబట్టి వరుస విజయాలు తన సొంతమయ్యాయి.
రావిపూడి నమ్మింది ఒక్కటే తన నిర్మాతల్ని వీలైనంత సేఫ్ జోన్లో పడేయడం. భారీ హంగులూ, ఆర్భాటాలూ తన సినిమాలో కనిపించవు. సెట్స్ తో జిమ్మిక్కులు చేయడు. `వరల్డ్ బిల్డింగ్` అనే పదాలు అస్సలు తెలీవు. తనకు తెలిసిందల్లా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచి పెట్టడం. వెంకటేష్లాంటి స్టార్ హీరోతో కేవలం 70 రోజుల్లో సినిమా ముగించిన ఘనుడు. పరిమిత వనరుల్ని ఎంత ప్రభావవంతంగా వాడుకోవాలో తెలుసు. మనదైన కథ, మామూలు కథలతోనే వినోదాలు పంచి హిట్లు కొట్టాడు. తన సినిమాల్లో కాస్త భిన్నంగా కనిపించేది `భగవత్ కేసరి` మాత్రమే. మిగిలినవన్నీ ఫన్ రైడ్సే. తన బలం తనకు పక్కాగా తెలుసు కాబట్టి, అదే దారిలో వెళ్లి విజయాల్ని అందుకొంటున్నాడు.
అనిల్ తనలో తాను మార్చుకోవాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. కథని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కథల పరంగా వీక్. ఈ సినిమాల్లో ఫన్ వర్కవుట్ అవ్వడం వల్ల కలిసొచ్చింది. సెకండాఫ్ విషయంలో రావిపూడి కాస్త ఉదాశీనంగా వ్యవహరిస్తుంటాడు. ఈ విషయాల్లో కొంత మెరుగు పరచుకొంటే రావిపూడి విజయాలు ఇక ముందు కూడా ఇలానే కొనసాగుతుంటాయి.