అనిల్ రావిపూడి తెలివైన దర్శకుడు. తన సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు బాగా తెలుసు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయం కోసం తాను పడిన కష్టం చిన్నది కాదు. ఆ సినిమాని జనంలోకి తీసుకెళ్లిన విధానం ఈతరం దర్శకులకు ఓ సిలబస్. ఇప్పుడు చిరంజీవితో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. సినిమా ఇలా మొదలెట్టాడో లేదో, ఇలా… తన స్టైల్ లో ఓ వీడియోని వదిలేశాడు. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులతో చిరుకి వెల్ కమ్ చెబుతూ, పనిలో పనిగా చిరు పాత సినిమాల్ని గుర్తు చేస్తూ, ఆ డైలాగుల్ని మళ్లీ వల్లిస్తూ కట్ చేసిన వీడియో ఇది. రావిపూడి స్టైల్ లోనే సరదాగా వుంది.
ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సుస్మిత కొణిదెల సైతం.. తనని తాను చిరుకి పరిచయం చేసుకోవడం ‘ఇంటి పేరుని నిలబెట్టు’ అంటూ చిరు స్ట్రాంగ్ గా చెప్పడం ఈ వీడియోలోని కొసమెరుపు. ‘రఫ్ఫాడిద్దాం’ అంటూ చివర్లో అనిల్ రావిపూడి ఎంట్రీ ఇవ్వడం కూడా బాగుంది. వింటేజ్ చిరుని గుర్తు చేస్తూ రావిపూడి ఈ సినిమా చేస్తున్నాడన్న క్లారిటీ ఈ వీడియోతో వచ్చేసింది.
2026 సంక్రాంతి విడుదలే లక్ష్యంగా ఈ సినిమాని మొదలెట్టారు. సంక్రాంతికి ఫ్యామిలీ కథలు బాగా వర్కవుట్ అవుతాయి. చిరు సినిమా కూడా అదే స్టైల్ లో తీస్తున్నారు. ఈ చిత్రం కోసం `చిరు నవ్వుల పండగ` అనే టైటిల్ పరిశీలనలో వుంది. అదే ఫైనల్ చేస్తారా, లేదంటే మరో కొత్త టైటిల్ తో సర్ప్రైజ్ చేస్తారా అనేది చూడాలి.