అనిల్ రావిపూడి… పరాజయం ఎరుగని దర్శకుడు. తాజాగా ఆయన ఖాతాలో రూ.300 కోట్ల సినిమా పడింది. అనిల్ రావిపూడితో సినిమా అంటే, నిర్మాతలూ.. బయ్యర్లు, డిస్టిబ్యూటర్లు అందరూ హ్యాపీనే. అయితే ఆయనది కామెడీ మార్క్. వినోదాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. సంక్రాంతికి వస్తున్నాం కూడా పూర్తి స్థాయి వినోద భరిత చిత్రమే. అయితే తనపై పడిన ‘కామెడీ’ ఇమేజ్ నుంచి బయటకు రావాలని చూస్తున్నారాయన. ‘భగవంత్ కేసరి’తో ఆ ప్రయత్నం కూడా జరిగింది. అయితే ఇప్పటికీ ఆయనపై అదే మార్క్ వుంది. అందుకే.. రాబోయే సినిమాల్లో కొత్త జోనర్లు టచ్ చేయాలని చూస్తున్నారు. ఈసారి మహాభారతం గాథని తెరపైకి తీసుకురావాలనుకొంటున్నారు. మహాభారతంలో చాలా గొప్ప అంశాలు, పాత్రలూ ఉన్నాయని, అందులో ఓ అంశాన్ని ఎంచుకొని సినిమాగా మలిస్తే బాగుంటుందన్న ఆలోచన వ్యక్తం చేశారు. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా స్పష్టం చేశారు.
నిజమే.. ఎన్ని వినోదాత్మక చిత్రాలు తీసినా రాని పేరు, ఓ మైథలాజికల్ సబ్జెక్ట్ డీల్ చేస్తే వస్తుంది. మేకర్‌గా తన మార్క్ చూపించాలంటే అలాంటి సబ్జెక్ట్స్ పట్టుకోవాల్సిందే. ప్రేక్షకులకు ఓ కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమాలు గుర్తుండిపోతాయి. దాంతో పాటు మార్కెట్ ని కూడా పెంచుకోవొచ్చు. త్రివిక్రమ్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయనవన్నీ కూల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లే. కథపై, సంభాషణలపై, పాత్రల్ని తీర్చిదిద్దే విధానంపై దృష్టి పెట్టారు. అయితే ఇప్పుడు ఆయన కూడా విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ తో చేసే సినిమా పూర్తిగా కొత్త జోనర్. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేస్తున్న సినిమా అది. మేకర్‌గా తన మార్క్ అందులో కనిపించబోతోందన్న నమ్మకం ఆయనకు ఉంది. అందుకే స్క్రిప్టు విషయంలో అంత జాగ్రత్త పడుతున్నారు. అనిల్ రావిపూడి కూడా ఇలాంటి ఆలోచనల్లోనే ఉన్నారు. జోనర్ మార్చి తనలోని మేకర్ని బయటకు తీసుకురావాలన్న తాపత్రయం ఆయనలో కనిపిస్తోంది. చిరంజీవితో చేయబోయే సినిమా ఎలాగూ ఎంటర్టైనరే. అనిల్ రావిపూడి మార్క్‌లోనే ఉంటుంది. తన కలల సినిమా చేయాలంటే మాత్రం కొంత కాలం ఆగాల్సిందే.