విమలారెడ్డి పాస్టర్లతో మీటింగ్ లు పెట్టి డబ్బుల కవర్లు పంచడం ముగిసిన తర్వాత బ్రదర్ అనిల్ రంగంలోకి దిగారు. పాస్టర్లతో సమావేశం అవుతున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ కు లేదా మరో పార్టీకి ఓటు వేయమని చెప్పడం లేదు. పాస్టర్ల సమస్యలపై మాట్లాడుతున్నారు. క్రైస్తవుల ఇబ్బందులు చెబుతున్నారు. అమలాపురంలోని ఇందుపల్లిలో పాస్టర్ల సదస్సులో పాల్గొన్న బ్రదర్ అనిల్ జగన్ పాలనలో క్రైస్తవులు పడుతున్న ఇబ్బందులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రంలో క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. వైఎస్ బిడ్డే కదా అని జగన్కు అవకాశం ఇస్తే రాష్ట్రంలో క్రైస్తవులు సువార్త సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అంతకంతకూ అప్పుల పాలవుతోందని, రేపు పుట్టబోయే బిడ్డలపైనా అప్పులు భారం పడే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. శత్రువులందరూ నశించిపోవాలని పేర్కొన్న ఆయన..రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అనిల్ పేర్కొన్నారు.
బ్రదర్ అనిల్ చెప్పాలనుకున్నది సూటిగానే చెబుతున్నారు. జగన్ రెడ్డిని గెలిపించడం అంటే దేవుడ్ని మోసం చేసడమేనని ఆయన చెబుతున్నారు. క్రైస్తవులు ఏమి అర్థం చేసుకుంటారో కానీ… బ్రదర్ అనిల్ క్రైస్తవ సువార్త సభలను ఏపీలో పెట్టుకోలేకోతున్నారని మాత్రం స్పష్టమవుతోంది. ఆయనకు అనుమతులు ఇవ్వడం లేదని అర్థం చేసుకోవచ్చు. శత్రువులందరూ నాశనమైపోవాలని ఆయన శపించడం… పాస్టర్ల మీటింగ్లో కొత్త కాన్సెప్ట్ అనుకోవచ్చు.