అనిల్ సుంకర… సినిమాలపై ప్యాషన్, పిచ్చి ఉన్న నిర్మాత. విదేశాల్లో వ్యాపారాల్ని సైతం పక్కన పెట్టి, సినిమాలపై ఫోకస్ పెంచాడీయన. అనిల్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ భారీ బడ్జెట్ వే. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట.. రెండ్రుపాయలు పెడతాడన్న పేరుంది. కానీ ఆయనకు విజయాలే లేవు. సోలో నిర్మాతగా అనిల్ సుంకరకు దారుణమైన పరాజయాలు, పరాభవాలు ఎదురయ్యాయి. మొన్నటికి మొన్న ఏజెంట్ డిజాస్టర్‌తో అనిల్ సుంకర బాగా నష్టపోయారు. దాంతో అనిల్ పై చిత్రసీమలో సానుభూతి ఏర్పడింది. ఆయన ఓ సినిమా హిట్టు కొడితే చూడాలని చాలామంది అనుకొన్నారు. వాళ్లందరి కల.. ‘సామజవరగమన’తో తీరింది. అసలు ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదలైన సినిమా ఇది. శ్రీవిష్ణు కెరీర్లోనే భారీ విజయాన్ని సాధించింది. సోమవారం కూడా ఈ సినిమా వసూళ్లు ఎక్కడా తగ్గలేదు. బీ,సీ, మల్టీప్లెక్స్ అనే తేడా లేదు. అన్ని చోట్లా… సోమవారం సైతం నిలకడైన వసూళ్లు అందుకొంది. ఈ సినిమాతో రూపాయికి మూడు రూపాయల లాభం అనిల్ సుంకర సంపాదించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అనిల్ సుంకర నష్టపోయిన దాంతో పోలిస్తే… సామజ వరగమన చాలా తక్కువ కావొచ్చు. కానీ ఈ విజయం అనిల్ సుంకరకు కావల్సినంత బూస్టప్ ఇస్తుందనడంలో సందేహం లేదు. పైగా ఆయన్నుంచి మరో భారీ చిత్రం ‘భోళా శంకర్’ రూపంలో వస్తోంది. చిరంజీవి – మెహర్ రమేష్ కాంబోలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమా కూడా లాభాల బాట పడితే, నిర్మాతగా అనిల్ మళ్లీ ట్రాక్‌లో పడినట్టే.