రీమిక్స్ పాటల సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. వారసత్వ హీరోలు.. పాత పాటల్ని తమ ఆస్తులుగా భావించి రీమిక్సులు చేసుకుంటున్నారు, అభిమానుల్ని అలరిస్తున్నారు. అల్లరోడికీ ఈ ఆలోచన వచ్చింది. తన కొత్త సినిమాలో `స్వాతిలో ముత్యమంత` అనే బంగారు బుల్లోడు పాటని రీమిక్స్ చేయాలని నిర్ణయించాడు. తన సినిమాకి `బంగారు బుల్లోడు` అనే టైటిల్ పెడుతున్నారు కాబట్టి, ఆ పాటని రీమిక్స్ చేయడం కొంతలో కొంత న్యాయమే.
అయితే ఈ పాట రీమిక్స్ చేయడానికి అయిన ఖర్చు అక్షరాలా 20 లక్షలు. పాత పాటని రీమిక్స్ చేయాలంటే ఆ పాటని స్వరపరచిన సంగీత దర్శకుడు, రాసిన రచయిత, నిర్మాతల అనుమతి తీసుకోవాలి. అందుకుగానూ నిర్మాత అనిల్ సుంకర 20 లక్షలు ఖర్చు పెట్టారట. `బంగారు బుల్లోడు`ని మరపించే సెట్ వేయాలంటే ఇంకొన్ని లకారాలు అదనంగా అవుతాయి. ఈ సినిమాలోని మొత్తం పాటల్ని కంపోజ్ చేయడానికే 20 లక్షలు అవ్వలేదు. ఇలాంటి పాటల వల్ల సినిమాకి వచ్చే అదనపు ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే.. అదీ కనిపించదు. జస్ట్.. నందమూరి ఫ్యాన్స్‌లో ఊపు తీసుకురావడానికే పనికొస్తుంది. అనిల్ సుంకర బాలయ్యకు పెద్ద అభిమాని. ఆ అభిమానంతోనే.. బాలయ్య పాటనీ, టైటిల్‌నీ ఇలా వాడుకుంటున్నారు. దాని కోసం 20 లక్షలు ఖర్చు. అంతే!