‘యానిమల్’తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది త్రిప్తి దిమ్రి. అంతకు ముందు కొన్ని సినిమాల్లో మెరిసినా రాని గుర్తింపు.. ‘యానిమల్తో’ దక్కింది. ఈ సినిమా తరవాత త్రిప్తి జాతకం మారిపోయింది. వరుస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తాజాగా ‘ఆషికి 3’లో కథానాయికగా ఎంపికైనట్టు బాలీవుడ్ టాక్. ‘ఆషికి’ ఫ్రాంచైజీకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఆషికి 1’, ‘ఆషికి 2’ సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు 3 కూడా వస్తోంది. ఇందులో కథానాయికగా త్రిప్తిని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. కార్తిక్ ఆర్యన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇది కాకుండా బాలీవుడ్ లో మరో రెండు సినిమాలకు సంతకాలు చేసింది.
అయితే టాలీవుడ్ దర్శక నిర్మాతలకు మాత్రం త్రిప్తి అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు.. త్రిప్తిని వెదుక్కొంటూ వెళ్లాయి. రవితేజ సినిమాలో నటించే ఆఫర్ దక్కింది. కానీ.. త్రిప్తి ఒప్పుకోలేదు. బడా నిర్మాణ సంస్థల నుంచి పిలుపు వచ్చినా త్రిప్తి పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తన దృష్టి ఇప్పుడు బాలీవుడ్ లేదా, పాన్ ఇండియా సినిమాలపైనే ఉందని, దక్షిణాది సినిమాల్ని పట్టించుకోవడం లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో చేసే ‘స్పిరిట్’లో త్రిప్తికి ఛాన్స్ రావొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే.. తన తొలి తెలుగు సినిమా కావొచ్చు.