తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం ఏమిటో చంద్రబాబు బయట పెట్టారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వును గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వాడినట్లుగా చంద్రబాబు కూటమి సమావేశంలో చెప్పారు.
జగన్ హాయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడితే.. తాము అధికారంలోకి రాగానే అన్నీ నాణ్యమైన పదార్థాలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నామన్నారు. చంద్రబాబు మిగతా విషయాలు చాలా చెప్పారు కానీ.. తిరుమలలో జరిగిన ఈ ఘోరం అంశం మాత్రం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. వైసీపీ హయాంలో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి పెత్తనం సాగేది. వీరు ముగ్గురూ అన్య మతస్తులన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రసాదం తయారీకి ఉపయోగించే పదార్ధాల విషయంలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. మంచి క్వాలిటీ నెయ్యి ఇచ్చే వారిని తొలగించారు. తమ ఇష్టం వచ్చిన వారికి ఇచ్చారు. వారు యానిమల్ ఫ్యాట్ ను పంపారని తాజాగా పరిశోధనల్లో తేలింది దాంతో ఆ కాంట్రాక్టర్లను ఆపేయించారు.
ఈ విషయం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. చంద్రబాబు బయట పెట్టడంతో .. శ్రీవారి భక్తుల్లో విస్తృత చర్చ జరగనుంది. ఇలాంటివన్నీ బయటకు వస్తాయన్న కారణంగా కొద్ది రోజులుగా తిరుమలను టార్గెట్ చేసుకుని ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తిరుమలలో గత ఐదేళ్ల కాలంలో అత్యంత ఘోరమైన పనితీరు ఉండేది.. కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం దారిలో పెట్టారు.