రాజ్ కోటిల జోరుతగ్గుతున్నప్పుడు మణిశర్మ వచ్చాడు. ఆయన హవా పలుచబడుతున్నప్పుడు చక్రి అందుకున్నాడు. చక్రి బాణీలు రొటీన్ అయిపోతున్న దశలో దేవిశ్రీ ప్రసాద్ కదం తొక్కాడు. అప్పటి నుంచీ దేవి జోరు సాగుతూనే ఉంది. మధ్యలో తమన్ టెన్షన్ పెట్టినా – రొటీన్ మ్యూజిక్‌తో తను కూడా వెనకడుగు వేశాడు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్‌కి మరో గట్టి పోటీ దారుడు వచ్చేశాడు… అనిరుధ్ రూపంలో. తమిళనాట అనిరుధ్ ఇప్పటికీ నెం.1 మ్యూజిక్ డైరెక్టరే. తెలుగులో ఎప్పుడో ఛాన్స్ వచ్చింది. కానీ.. బిజీ షెడ్యూల్ వల్ల తెలుగు సినిమాలపై దృష్టి పెట్టలేకపోయాడు. ఇప్పుడు అజ్ఞాతవాసితో తెలుగులో ఎంట్రీ దక్కింది. ఈ సినిమాకి ఇప్పటి వరకూ జరిగిన ప్రమోషన్లు చూస్తే.. దాని వల్ల లబ్ది పొందింది అనిరుధ్ మాత్రమే అనే విషయం తేటతెల్లమవుతుంది. బయటకొచ్చి చూస్తే.. అనే పాటతో ఒక్కసారిగా అనిరుధ్ కలకలం సష్టించాడు. పవన్ కోసం ఓ పాట డెడికేట్ చేసి… పవన్ అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు. అనిరుధ్ జోరు చూసి.. ఎన్టీఆర్ సినిమాకీ తననే తీసుకున్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు క్రమంగా పెద్ద హీరోలు, అగ్ర దర్శకుల దృష్టి.. అనిరుధ్‌పై పడుతోంది. ఇది… దేవిని టెన్షన్ పెట్టే విషయమే.
ఈమధ్య కాలంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో పదును తగ్గిందన్నది వాస్తవం. ఈమధ్య విడుదలైన ఎంసీఏ అందుకు పెద్ద ఉదాహరణ. జై లవకుశ, జయ జానకీ నాయకలో తన స్థాయికి తగిన పాటలు ఇవ్వలేకపోయాడు దేవి. పాటలన్నీ ఒకేలా ఉండడం, నేపథ్య సంగీతం విషయంలోనూ ధ్యాస తగ్గడం, అగ్ర కథానాయకులు వెరైటీ వైపు దృష్టి పెట్టడం, దానికి తోడు.. దేవి పారితోషికం చుక్కల్ని తాకుతుండడంతో.. ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ దశలో అనిరుధ్ ఓ మంచి ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. అజ్ఞాతవాసి విడుదలకు ముందే.. అనిరుధ్‌కి మంచి ఆఫర్లు అందుతున్నాయి. ఇక ఆ సినిమా విడుదలై, అందులో అనిరుధ్‌కి పేరొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ కి ఎదురు దెబ్బ తప్పకపోవొచ్చు.