మిస్టర్ పెర్ఫెక్ట్ లాంటి దర్శుకుల్లో త్రివిక్రమ్ ఒకరు. సన్నివేశం తన ఆలోచనలకు దగ్గరగా వచ్చేంత వరకూ అమర శిల్పి జక్కన్న లా చెక్కుతూనే ఉంటాడని పేరు. చిన్న విషయానికి కూడా కాంప్రమైజ్ అవ్వని వ్యక్తిత్వం త్రివిక్రమ్‌ది. అందుకే త్రివిక్రమ్ సినిమా అంటే మినిమం 9 నెలల సమయం పడుతుంది. అయితే…. పవన్ కల్యాణ్ తో చేస్తున్న సినిమా విషయంలో మాత్రం త్రివిక్రమ్ తన శైలికి భిన్నంగా ఆలోచించాల్సివస్తోంది. ఈ సినిమాని నాలుగుంటే నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్నది పవన్ లక్ష్యం. దాంతో మిత్రుడు త్రివిక్రమ్ పై ఒత్తిడి పెరిగింది. చాలా విషయాల్లో త్రివిక్రమ్ కాంప్రమైజ్ అవ్వాల్సివస్తోందని సమాచారం. కథానాయికల విషయంలో త్రివిక్రమ్ రాజీ పడిపోయాడని, మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టుల్నీ ముందు రాసుకొన్నవాళ్లని కాకుండా, అందుబాటులో ఉన్నవాళ్లని ఎంచుకొంటున్నాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే.. ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్‌పై పడకుండా ఈ మాటల మాంత్రికుడు అడుగుడుగునా జాగ్రత్తలు తీసుకొంటున్నాడని తెలుస్తోంది.
అనిరుథ్‌తో మాత్రం కాస్త సమస్యగానే ఉందని, ఇచ్చిన టైమ్‌కి అనిరుథ్ పాటల పని పూర్తి చేస్తాడా, లేదా? అనే సందిగ్థంలో త్రివిక్రమ్ ఉన్నాడని సమాచారం. పవన్‌తో సినిమా అనుకొన్న తరవాత.. ఈ టీమ్‌లోకి వచ్చిన తొలి టెక్నీషియన్ అనిరుథే. ఈ కథ విన్న తొలి సాంకేతిక నిపుణుడు కూడా తనే. అయినప్పటికీ ఇప్పటికీ పాటల పని పూర్తి కాలేదట. నేపథ్య సంగీతానికీ అనిరుథ్ ఎక్కువ సమయం తీసుకొంటాడు. అలాంటప్పుడు పవన్ టార్గెట్‌కి రీచ్ అవ్వడం కష్టం కావొచ్చు. త్రివిక్రమ్ కూడా అనిరుథ్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నాడని, దాంతో అనిరుథ్ కాస్త అసహనం ఫీల్ అవుతున్నాడని తెలుస్తోంది. అ.ఆ సినిమాకి అనిరుథ్‌నే సంగీత దర్శకుడిగా ఎంచుకొన్నారు. కానీ.. టైమ్ ఫ్యాక్టర్ వల్ల తనని తప్పించి మిక్కీ ని టీమ్‌లోని తీసుకొన్నారు. ఈ సారి అలాంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే అనిరుథ్ ఇప్పటికి మూడు పాటల్ని ఇచ్చేశాడు. మిగిలిన రెండు పాటలతోనే చిక్కు. దాని తరవాత ఆర్.ఆర్ మరో సమస్య. మరి ఈ ఛాలెంజ్‌ని అనిరుథ్ ఎలా తీసుకొంటాడో చూడాలి.