అనిరుథ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రాజెక్ట్ ఏదైనా సరే… హీరో ఎవరున్నా సరే.. క్రేజీ, వైరల్ మ్యూజిక్ ఇవ్వడం అనిరుథ్ స్పెషాలిటీ. ట్యూన్స్ రిపీట్ అవుతున్నాయనే కంప్లైట్ వున్నా అవి సినిమాపై ఎఫెక్ట్ చూపడం లేదు. రెడీమెడ్ గా కిక్ ఇచ్చే మ్యూజిక్ ఇవ్వడంలో అనిరుధ్ రూటే వేరు. ముఖ్యంగా థియేటర్స్ అదిరిపోయే బీజీఎం ఇవ్వడంలో తనది ప్రత్యేకమైన బాణీ. చాలా సీన్లని తన బీజియమ్స్ తో నిలబెట్టాడు. తమిళంలో క్రేజీ చిత్రాలకు అతనే కేరాఫ్ అడ్రస్స్.
డైరెక్టర్, ప్రాజెక్ట్ నచ్చితే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా మ్యూజిక్ చేయడం కూడా అనిరుధ్ ప్రత్యేకత. ఇప్పుడు టాలీవుడ్ తయారౌతున్న చాలా సినిమాలు అనిరుథ్ వైపు చూస్తున్నాయి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్నూరి కలయికలో వస్తున్న సినిమాని అనిరుధే మ్యూజిక్. అలాగే గౌతమ్ కొత్తవాళ్ళతో చేస్తున్న మ్యాజిక్ సినిమాకి కూడా ఆయనే బాణీలు సమకూరుస్తున్నాడు.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి కూడా అనిరుథ్ పేరునే ఫైనల్ చేసుకున్నారు. దేవిశ్రీని తీసుకోవాలా? అనిరుథ్ వైపు వెళ్లాలా? అనే విషయంలో నాని, శ్రీకాంత్ ఓదెల మధ్య గట్టి చర్చ నడిచింది. చివరికి అనిరుథ్ కి ఓటేశారు. నాని, అనిరుధ్ కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. ఇంతకుముందు జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకి కలసి పని చేశారు. ఇవే కాదు అనిరుధ్ సంగీత సారధ్యంలో పని చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. అటు అనిరుధ్ కూడా గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తమన్, దేవిశ్రీ ప్రసాద్.. తెలుగులో పెద్ద సినిమాలంటే వీళ్లే గుర్తొస్తున్నారు. ఇప్పుడు అనిరుథ్ కూడా ఓ మంచి ప్రత్యామ్నాయంగా మారిపోయాడు. తెలుగులో కొత్త తరహా సంగీతం విందాం అనుకొనేవాళ్లకు ఇది మంచి పరిణామమే.