వేశ్య పాత్రలు నటీమణులుకు ఓ కొత్త ఇమేజ్ తో పాటు అవార్డులు తెచ్చిపెడతాయి. అలనాటి వహీదా రెహ్మాన్ నుంచి నేటి అలియా భట్ వరకూ వేశ్య పాత్రల్లో అదరగొట్టిన తారల లిస్టు పెద్దదే. తెలుగులో మధురవాణి పాత్రలో సావిత్రి అభినమయం మర్చిపోలేం. వేదంలో అనుష్క పాత్ర కూడా ఆమె కెరీర్ లో ఓ మైలు రాయి. అయితే ఈ పాత్రలు చేయాలంటే ధైర్యం వుండాలి. అలాంటి ధైర్యాన్ని చూపుతూ ఇటివల గాంగ్స్ అఫ్ గోదావరిలో కనిపించింది అంజలి. ఇప్పుడు బహిష్కరణ వెబ్ సిరిస్ లో కూడా అలాంటి డేరింగ్ పాత్రలో కనిపించింది. తాజాగా జీ5 స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరిస్ ప్రేక్షకులు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? పిరియాడికల్ రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ సిరిస్ లో చెప్పుకోదగ్గ అంశాలు ఏమిటో చూద్దాం.
1990. గుంటూరు జిల్లా ‘పెద్దపల్లి’ గ్రామం. చూట్టుపక్కల వున్న పదూర్లకు సర్పంచ్ శివయ్య( రవీంద్ర విజయ్). అక్కడ శివయ్య మాటే వేదం. కుల వివక్ష, రాచరికం పోకడలున్న శివయ్య అక్కడి జనాల్ని బానిసలుగా చూస్తుంటాడు. శివయ్య దగ్గర నమ్మిన బంటులా పని చేస్తుంటాడు దర్శి( శ్రీతేజ్). అదే వూరికి పొట్టకూటికి వస్తుంది పుష్ప(అంజలి). తనో వేశ్య. పుష్ప అందచందాలు చూసిన శివయ్య ఊరి చివర ఇంట్లో ఆమెను ఉంచే ఏర్పాటు చేస్తాడు. ఆమె బాగోగులు చూసే బాధ్యత దర్శికి అప్పగిస్తాడు. దర్శి, పుష్పల మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారుతుంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. వీరి ప్రేమ, పెళ్లి సంగతి తెలుసుకున్న శివయ్య ఏం చేశాడు? ఈ కథలో లక్ష్మీ (అనన్య నాగేళ్ళ ) పాత్ర ఏమిటి? దర్శి జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరు? ఆ ఊర్లో వరుసగా జరుగుతున్న అమ్మాయిల చావులకి కారణం ఎవరు? ఇదంతా మిగతా సిరిస్.
కుల వివక్ష, రాచరికం పోకడలు, కీచకుడైన పాలకుడు, అణిచివేత.. ఇలాంటి నేపధ్యంలో వచ్చే కథలు దాదాపు ఒకటే దారిలో వెళ్తాయి. అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. చివరికి కీచకుడు అంతం అవుతాడు. బహిష్కరణ పాయింట్ కూడా అదే. ఇది వరకూ చాలా సినిమాల్లో చూసినదే. అయితే పాత్రల మధ్య వున్న డ్రామాని ఆసక్తికరంగా మలచడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాడు దర్శకుడు ముఖేష్ ప్రజాపతి. సంఘర్షణ పాతదే అయినా డ్రామాని చివరి వరకూ ఒడిసిపట్టుకోవడం ఈ సిరిస్ లో ప్రత్యేకత.
నిజానికి కేవలం నాలుగు కీలకమైన పాత్రల మధ్య ఆరు ఎపిసోడ్ల వెబ్ షో రన్ చేయడం అంత తేలికకాదు. శివయ్య, పుష్ప, దర్శి, లక్ష్మీ.. ఈ నాలుగు పాత్రలు చుట్టూ దర్శకుడు నడిపిన సన్నివేషాలు మరీ అంత గొప్పగా వుండవు కానీ మరీ తీసిపారేసినట్లుగా కూడా వుండవు.
ALso Read : ‘పేక మేడలు’ రివ్యూ: మధ్యతరగతి మందహాసాలు
ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా తొలి ఎపిసోడ్ మొదలౌతుంది. అర్ధరాత్రి పూట ఓ అమ్మాయి బావిలో దూకేసే సన్నివేశంతో కథలోకి వెళ్లాడు దర్శకుడు. తర్వాత ఈ ఎపిసోడ్ లో చూపించే చాలా సీన్స్ తాలూకా బ్యాక్ స్టొరీ ఎదో వుందనే కోణంలో సాగుతాయి. గులాబి పువ్వులని కథలో భాగం చేస్తూ చిత్రీకరించిన సీన్స్, తండ్రి కోసం పాప ఎదురు చూసే ఘట్టం ఎమోషనల్ గా వుంటాయి.
సెకండ్ ఎపిసోడ్ నుంచి ఫ్లాష్ బ్యాక్ మొదలౌతుంది. పుష్ప – దర్శి ప్రేమకథలో పెద్ద కొత్తదనం వుండదు. లవ్ ఫెయిల్యూర్ గా దర్శి తాగుడుకు బానిసైన సన్నివేశాలు, అలాగే లక్ష్మి కథని బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. శివయ్య పాత్ర కూడా ఒక దశ తర్వాత రొటీన్ వ్యవహారంలా తయారౌతుంది. దర్శి జైలు నుంచి వచ్చిన తర్వాత కథ మళ్ళీ వేగం పుంజుకుంటుంది. ఇందులో వరుసగా అమ్మాయిలు చనిపోవడం అనే మరో లేయర్ వుంది. అయితే అప్పటివరకూ ఆ లేయర్ ని పెద్దగా హైలెట్ చేయకుండా కేవలం క్లైమాక్స్ కోసమే కన్వినియంట్ గా వాడుకున్నారా? అన్నట్లుగా వుంటుంది ఆ ట్రీట్మెంట్. క్లైమాక్స్ లో ఊహించినట్లే పుష్ప క్యారెక్టర్ ముగించారు. అయితే ఈ మాత్రం రివెంజ్ కి ఇంత కాలం ఎదురుచూడటం ఎందుకనే ఫీలింగ్ కలుగుతుంది. అమ్మాయిల చావుకి కారణం పుష్పకి తెలిసినప్పుడు దర్శి పాత్ర కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారం అంతా నిడివి పెంచడానికే అనే భావన కలిగించింది.
అంజలి మొదటి నుంచి నటనకు ఆస్కారం వుండే పాత్రలే చేస్తున్నారు. పుష్ప కూడా పెర్ఫార్మెన్స్ కి వీలున్న పాత్రే. వేశ్య పాత్ర అయినప్పటికీ ఎక్కడా లిబార్టీ తీసుకోకుండా హుందాగా చిత్రీకరించారు. అంజలి అనుభవం పుష్ప పాత్రకు పనికొచ్చింది. అయితే ఆ పాత్రని దర్శకుడు గుర్తుపెట్టుకునేంత బలంగా తీర్చిదిద్దలేకపోయాడనిపించింది. దర్శి పాత్ర లో శ్రీతేజ్ సహజంగా కనిపించాడు. అనన్య కూడా తన పాత్రకు న్యాయం చేసింది. శివయ్య పాత్రలో రవీంద్ర విజయ్ నటన బావుంది. ఫ్యూడల్ మెంటాలిటీనీ నేచురల్ గా చూపించగలిగాడు. అయితే డబ్బింగ్ లో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఆయన మాట్లాడుతున్నప్పుడు డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మిగతా నటీనటులు పరిధిమేర కనిపించారు. పిరియాడిక్ డ్రామా ఇది. నాటి పరిస్థితులు తగ్గ లోకేషన్స్ ని పట్టుకున్నారు. కెమరాపనితనం, మ్యూజిక్ డీసెంట్ గానే వున్నాయి. కొన్ని డైలాగ్స్ బావున్నాయి. ‘నీతో తిరుగుతుంటే మా ఊరు కొత్తగా రంగులేసినట్లు కనిపిస్తోంది’ అనే మాట ప్లేస్ మెంట్ బావుంది.
ఈ సిరిస్ లో ఫ్రెష్ నెస్ లేదు కానీ.. రా & రస్టిక్ కంటెంట్ ని ఇష్టపడేవారికి నచ్చే ఛాన్స్ వుంది. వైలెన్స్, అడల్ట్ ఎలిమెంట్స్ దండిగా వున్నాయి. ఫ్యామిలీతో కలిసి చూడడం ఇబ్బంది కరమే.