ఎంత అణిచేద్దామనుకున్నా, ముందు రోజు నుంచి జిల్లాల్లో అరెస్టు చేసినా, ట్యాంక్ బండ్ గుప్పిట్లో పెట్టుకున్నా… చివరికి ఆర్టీసీ కార్మికులు, మద్దతుదారులు నిరసన తెలిపేందుకు హైదరాబాద్ రాగలిగారు. ప్రభుత్వం తీరుకి వ్యతిరేకంగా చేపట్టిన ఛలో ట్యాంక్ బండ్ సక్సెస్ అయిందని ఆర్టీసీ జేయేసీ నేతలు చెబుతున్నారు. పోలీసుల లాఠీఛార్జ్, ట్యాంక్ బండ్ మీద కొన్ని చోట్ల రక్తపు మరకలు… ఇవన్నీ ఇప్పుడు చర్చనీయం అవుతుంటే, ఈ పరిస్థితి కారణం ప్రభుత్వమే అనేది ప్రముఖంగా ప్రచారంలోకి వస్తుంటే, దాన్ని ఎలా తిప్పికొట్టాలో వారికి అర్థమౌతున్నట్టు లేదు! ఆ తడబాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వహించిన మిలియన్ మార్చ్ నిరసనలో మావోయిస్టు సంఘాలు చొరబడ్డాయన్నారు సీపీ! పి.డి.ఎస్.యు., ఆర్.ఎస్.యు.తోపాటు కమ్యూనిస్టు పార్టీల నాయకులు ట్యాంక్ బండ్ మీదికి చొరబడేందుకు ప్రయత్నించారంటూ అంజనీకుమార్ మీడియాకి చెప్పారు. అలాంటి శక్తులు చొరబడ్డాయి కాబట్టి, సామాన్య ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా వారిని అడ్డుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంతమంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డారనీ, డ్యూటీ చేస్తున్న పోలీసులపై కొంతమంది రాళ్లు రువ్వారనీ, ఈ ఘటనకు పాల్పడ్డవారిపై ఐ.పి.సి.లోని పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశామని చెప్పారు.
లాఠీ ఛార్జ్ ఎందుకు జరిగిందీ అంటే మావోయిస్టు అనుబంధ సంఘాలు నగరంలోకి చొరబడ్డాయి కాబట్టి! మరి, గాయపడ్డ మహిళలు చాలామంది ఉన్నారే! ముళ్ల కంచెల మీద పడిపోయినవారు చాలామంది కనిపించారే! వీళ్లంతా ఎవరు..? పోలీసుల లెక్క ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే ట్యాంక్ బండ్ మీదికి చొరబడే ప్రయత్నం వీళ్లు చేశారన్నమాట. ఎందుకో, ఈ వాదన వింటుంటే గోడ కట్టినట్టు కాదుకదా, కనీసం తడిక కట్టినట్టుగా కూడా అనిపించడం లేదు. నెలకి పైగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే… ఇప్పుడు మావోయిస్టులు వచ్చి చేరారని పోలీసులే వాదించడం సరైన సమర్థనగా లేదు! ఇప్పటికే జీతాల్లేక, భవిష్యత్తు ఏమౌతుందో తెలీక ఆవేదనతో ఉన్న కార్మికులను మరింత రెచ్చగొట్టే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు పనిచేస్తాయి. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూడటమంటే కేవలం లాఠీలు ఝుళిపించడమే కాదు కదా, చేసే వ్యాఖ్యానాలు కూడా సామరస్యపూర్వకంగా ఉండాలి.