” పతకాలు గెలిచినప్పుడు మాత్రమే మమ్మల్ని భారతీయులుగా చూస్తారు. మిగిలిన సమయంలో చింకీస్, నేపాలీస్, చైనీస్.. తాజాగా కరోనా అని కూడా పిలుస్తున్నారు..” అని అంకితా కొన్వర్ అనే సెలబ్రిటీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆమె ఈశాన్య రాష్ట్రానికి చెందినవారే. అయితే ఫిట్నెస్ ప్రపంచంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ మోడల్ మిలింద్ సోమన్ ను పెళ్లి చేసుకున్నారు. మణిపూర్‌కు చెందిన మీరాబాయి చాను ఒలింపిక్స్‌లో రజతం గెలవడంతో .. దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అమెను భారతీయురాలిగా గర్విస్తున్నామని చెబుతున్నారు. ఈ అంశంపై … అంకితా కొన్వర్ తనలో గూడు కట్టుకుపోయిన ఆవేదనను.. ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రాల ప్రజలను నిఖార్సయిన భారతీయులుగా చూడటం లేదనేది నిజం. వారిని ఉత్తరాదిలోనే అనుమానంగా చూస్తారు. దక్షిణాది లాంటి రాష్ట్రాలకు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వస్తే వారిని విదేశీయులుగా ట్రీట్ చేస్తారు. అనేక సార్లు ఇది చోటు చేసుకుంది. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో వారు దక్షిణాదిలో కానీ ఉత్తరాదిలో కానీ చోటు దక్కించుకుంటే చాలా వివక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందనేదానికి అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సినిమాలలో కూడా ఈ విషయాన్ని చెబుతూనే ఉంటారు. పింక్ సినిమాలో ముగ్గురు మిత్రుల్లో ఒకరు ఈశాన్య రాష్ట్రానికి చెందిన వారు. సాక్షాత్తూ కోర్టులోనే ఆమె విదేశీయురాలన్న భావనతో లాయర్ వాదించిన సీన్లు ఉంటాయి. వారిపై జరుగుతున్న వివక్షకు అద్దం పట్టేలా అవి ఉన్నాయి. బయట అంతకు భిన్నంగా ఏమీ జరగడం లేదు.
కారణం ఏదైతేనేం… ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రతిభావంతమైన క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు. అయితే విజయం సాధించినప్పుడు మాత్రమే ఎక్కువ మంది వారిని భారతీయులుగా గుర్తించి ప్రశసంసలు కురిపిస్తున్నారు. ఇదే విషయాన్ని అంకితా కొన్వర్ బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయంలో చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ.. సాక్షాత్తూ ఆమె తనకు తానుగా ఎదుర్కొన్న అవమానాల గురించి వెల్లడించి.. ఈ అభిప్రాయానికి వచ్చారు. అక్కడి ప్రాంతాల ప్రజల వేదనను ఆమె బయట పెట్టారు. ఆమె ట్వీట్‌పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరగవచ్చు కానీ.. వారిని భారతీయులుగా పరిగణించకుండా వివక్ష చూపించేవారిలో ఒక్కరిలో మార్పు వచ్చినా.. మార్పు మొదలైనట్లే.