కూటమి అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు మొదట చేసిన సంతకాల్లో అన్న క్యాంటీన్లు కూడా ఒకటి. దీనిపై ఇప్పటికే ఫోకస్ చేసిన సర్కార్, ఆగస్టు 15వ తేదీ నుండి మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
గతంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను తిరిగి అందుబాటులోకి తెచ్చేలా ఆ భవనాలకు మరమ్మత్తులు చేస్తున్నారు. స్థానిక సంస్థల నుండి ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. తొలి దశలో 183 అన్న క్యాంటీన్లు ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టబోతున్నాయి.
ఇటు అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థలకు టెండర్లు కూడా పిలిచారు. ఈ నెల 22వరకు టెండర్లు స్వీకరించి, ఆ తర్వాత టెండర్లు ఫైనల్ చేయబోతున్నారు.
ఈ 183 అన్న క్యాంటీన్లతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వీలైనంత త్వరగా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖలు సమన్వయంతో భవనాలు నిర్మిస్తున్నాయి. కొన్ని చోట్ల ఖాళీగా ఉన్న భవనాలు వాడుకునే అంశాలను పరిశీలిస్తున్నాయి.
పేదోడి కడుపు నింపే అన్న క్యాంటీన్లను రాజకీయ కక్షలతో మూసేశారు. కానీ, ఇప్పుడవి మళ్లీ కడుపు నింపబోతున్నాయని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.