తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన అన్న కేంటీన్లను గత నెలాఖరు నుంచి మూతబడిన సంగతి తెలిసిందే. పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ప్రారంభమైన కేంటీన్లు.. కొద్దికాలంలోనే మంచి ఆదరణ పొందాయి. అధునాతన భవనాల్లో కేంటీన్లను గత ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, వైకాపా సర్కారు నిర్ణయంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతోంది. పేదల్లో వ్యక్తమౌతున్న ఆగ్రహాన్ని అద్దం పడుతూ గత వారంలో రాష్ట్రంలో మూతపడి ఉన్న అన్ని అన్నా కేంటీన్ల దగ్గరా తెలుగుదేశం పార్టీ నిరసన తెలిపింది. ఎన్టీఆర్ పేరు తీసేయాలన్న ఉద్దేశమే ఉంటే, ఏదో ఒకటి చేసేసి పేదలకు అన్నం పెట్టాలంటూ ధర్నాలు చేశారు.
టీడీపీ ధర్నాలకు స్పందించిందా, కేంటీన్ల మూసివేతతో పేదల్లో వ్యక్తమౌతున్న అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించిందో ఏమో తెలీదుగానీ… త్వరలోనే అన్నా కేంటీన్లను తెరిచేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. వచ్చే నెల 2వ తేదీ నుంచి కేంటీన్లను పునః ప్రారంభించేందుకు చర్యలు మొదలైనట్టుగా తెలిసింది. ఈ మేరకు కేంటీన్లలో భోజనాలను అందిస్తున్న అక్షయపాత్ర సంస్థకు అధికారుల నుంచి సూచనప్రాయంగా సమాచారం వచ్చిందనీ, కేంటీన్ల నిర్వహణకు సిద్ధం కావాలంటూ వారికి సంకేతాలు అందినట్టుగా తెలుస్తోంది. అయితే, మూతపడ్డ అన్ని కేంటీన్లు ఒకేసారి తెరుస్తారా… కొన్ని మాత్రమే తెరుస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అన్న కేంటీన్ల పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతీ తెలిసిందే. దీంతో త్వరలో ఒక కొత్త పేరుతో కేంటీన్లు తిరిగి తెరుచుకోనున్నాయి.
జగన్ సర్కారు తీసుకున్న మిగతా నిర్ణయాలు బాగున్నాయంటూ అభిప్రాయం ఉన్నా.. అన్న కేంటీన్ల మూసివేత మీద వ్యతిరేకతే సర్వత్రా వ్యక్తమైంది. ఎన్టీఆర్ పేరున్నంత మాత్రాన, తెలుగుదేశం ప్రవేశపెట్టినంత మాత్రాన దీన్ని కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆపేయాలా అనే అభిప్రాయం వ్యక్తమైంది. పేదలకు తిండి, ఆరోగ్యం లాంటి అంశాల్లో కూడా గత ప్రభుత్వాలు చేశాయి కదా… మేమెందుకు కొనసాగించాలనే పట్టుదలను వదులుకుంటే మంచిదే. త్వరలో పునః ప్రారంభం కానున్న అన్న కేంటీన్లలో గతం కంటే మరింత మెరుగైన భోజనం పెడతామని వైకాపా నేతలు అంటున్నారు. కేవలం పేరు మార్పునకే మూసేశారనే విమర్శలు రాకుండా ఉండాలంటే, మెనూపై శ్రద్ధ పెడితే మంచిదే.