ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వార్డు సచివాలయాలుగా.. అన్న క్యాంటీన్లు రూపాంతరం చెందుతున్నాయి. గ్రామాల్లో .. గ్రామ పంచాయతీ కార్యాలయాలను.. గ్రామ సచివాలయాలుగా మారుస్తున్నప్పటికీ.. పట్టణాల్లో మాత్రం… వసతి దొరకడం కష్టంగా మారింది. దాంతో.. అన్న క్యాంటీన్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మంచి డిజైన్తో రూపొందించిన అన్న క్యాంటీన్లలో కొద్దిగా.. మార్పు మార్చి.. లోపల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే.. అదే వార్డు సచివాలయం అవుతుందని తేల్చారు. వెంటనే.. అమలు చేయడం ప్రారంభించారు. నెల్లూరు టౌన్లో ఉన్న పలు… అన్న క్యాంటీన్లలో.. వార్డు సచివాలయ పనులు ప్రారంభమయ్యాయి. ఫర్నీచర్ అమర్చడం ప్రారంభించారు.
అన్న క్యాంటీన్లకు ఇప్పటికే తెల్ల రంగు పూసేశారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత పది రోజులకే వాటిని మూసేశారు. అంత కంటే ముందే.. పసుపురంగుతో ఉన్న అన్న క్యాంటీన్లకు సున్నం పూయడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. దాని ప్రకారం.. అన్న క్యాంటీన్లన్నీ.. తెలుపు రంగంలోకి మారిపోయాయి. చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. ఇప్పుడు పట్టణాల్లో వాటిని వార్డు సచివాలయాలుగా వాడుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీని వల్ల.. వార్డు సచివాలయాల ఏర్పాట్లకు చాలా వరకు ధనం ఆదా అవుతందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అన్న క్యాంటీన్లు నిలిపి వేసి పేదల నోటి దగ్గర అన్న తీసేశారని విమర్శలు రావడంతో.. గతంలోనే… మంత్రి బొత్స సత్యనారాయణ.. అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించారు. రాజన్న క్యాంటీన్ అని పేరు మార్చి అయినా కొనసాగిస్తామన్నారు. సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా ప్రారంభిస్తామని చెప్పారు. కానీ.. అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. ఆ తర్వాత ఎలాంటి.. స్పందనా ప్రభుత్వం వద్ద నుంచి రాలేదు. అంటే.. ఇక అన్న క్యాంటీన్లను ఏ పేరుతోనూ ప్రారంభించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న అభిప్రాయం ఏర్పడుతోంది.