ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అన్న క్యాంటీన్లను ఏపీలో అమల్లోకి తీసుకు రానున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అన్న క్యాంటీన్లు తెరుస్తామని పేదల ఆకలి తీరుస్తామని టీడీపీ సూపర్ సిక్స్ హామీల్లో ప్రకటించింది. ఆ మేరకు చర్యలు తీసుకుంది. ముందుగానే వంద క్యాంటీన్లను ప్రారంభిస్తోంది.
అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం 2018లోనే ప్రారంభించింది. పేదల నుంచి విశేష ఆదరణ లభించింది. దీంతో తాము గెలిచినా అన్న క్యాంటీన్లు ఉంటాయని నమ్మించేందుకు వైసీపీ నేతలు రాజన్న క్యాంటీన్లను ప్రారంభించి నాలుగు రూపాయలకే భోజనం అంటూ హడావుడి చేశారు. తీరా గెలిచిన తర్వాత అన్న క్యాంటీన్లు రద్దు చేశారు.. రాజన్న క్యాంటీన్లూ ఎత్తేశారు. పేదల్ని ఆకలితో అలమటించేలా చేశారు.
అన్న క్యాంటీన్లలో రోజు కూలీలు .. అడ్డాకూలీలు.. చిరు ఉద్యోగులు.. చిరు వ్యాపారులు కూడా ఆకలి తీర్చుకునేవారు. విధి నిర్వహణ లేకపోతే.. చిరు వ్యాపారం కోసం బయటకు వచ్చేవారు.. భోజనాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటి వారందరికీ అన్న క్యాంటీన్లు పెద్ద రిలీఫ్ ఇచ్చాయి. వృద్ధులకూ ఈ క్యాంటీన్లు బాగా ఉపయోగపడ్డాయి. కానీ వైసీపీ సర్కార్ అందర్నీ మోసం చేసింది. ఇప్పుడు ఆ తప్పు దిద్ది.. మళ్లీ అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభిస్తున్నారు.
విరాళాల పద్దతిని ప్రవేశ పెట్టడం ద్వారా ఎక్కువ ఖర్చు లేకుండా చూసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు అన్న క్యాంటీన్లకు విరాళం ఇస్తున్నారు. ఎవరైనా సామాజిక సేవ చేయాలనుకునేవారు.. అన్నక్యాంటీన్లకు విరాళం ఇస్తే వారి పేర్లను డిస్ ప్లే చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.