ఒకప్పుడు సమైక్యరాష్ట్రంలో మిగిలిన జిల్లాలను నిర్లక్ష్యం చేసి కేవలం హైదరాబాద్ నే అభివృద్ధి చేయడం ఎంత పొరపాటో రాష్ట్ర విభజన తరువాత అర్ధమయింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ అదే పొరపాటు చేయడానికి కంకణం కట్టుకొన్నట్లు కనిపిస్తోంది. పరిశ్రమలు, ప్రాజెక్టులు, పెట్టుబడులు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని అన్నిటినీ కూడా అమరావతికే మళ్లిస్తూ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలను నిర్లక్ష్యం చేస్తోందని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరికి అన్నా క్యాంటీన్లను కూడా అమరావతిలోనే మొదట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేయడంలో ఉద్దేశ్యం పేద ప్రజలకి తక్కువ ధరకే అల్పాహారం, భోజనం అందించడం. ఆ ప్రయోజనం నెరవేరాలంటే రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలలో వాటిని మొదట ఏర్పాటు చేయాలి. కానీ ఏదయినా సరే అమరావతికే ముందు కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచన సరికాదు.
రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకొన్నారు. కానీ అది సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కర్నూలు లేదా విశాఖపట్టణంలో హైకోర్టుని ఏర్పాటు చేయమని కోరితే అది కూడా అమరావతిలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొంది. చివరికి అన్న క్యాంటీన్ల కోసం ఈవిధంగా అడగవలసి రావడం శోచనీయమే.
రాష్ట్రంలో అమరావతి తప్ప వేరే జిల్లాలు లేనట్లుగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు. ముఖ్యంగా ఇటువంటి సంక్షేమ పధకాలను అవి బాగా అవసరం ఉన్న జిల్లాలలో ప్రవేశపెట్టడం చాలా అవసరం. నేటికీ రాయలసీమ, ఉత్తరాంధ్రాలో అనేక మారుమూల ప్రాంతాలలో ప్రజలకి ప్రాధమిక సౌకర్యాలు కూడా లేక నానా కష్టాలు పడుతున్నారు. వాటి సమస్యలు పట్టించుకోకుండా అమరావతిపైనే ఎప్పుడూ దృష్టి కేంద్రీకరించి, దానినే అభివృద్ధి చేసుకొంటూపోతే మళ్ళీ చరిత్ర పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ఈ వివక్షని గట్టిగా ప్రశ్నించిన టిజి వెంకటేష్ వంటి వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చి నోరు మూయించే ప్రయత్నం చేయడం కంటే, ఆవిధంగా ప్రశ్నించే అవకాశం వారికి లేకుండా అన్ని జిల్లాలను సరిసమానంగా అభివృద్ధి చేయడం ప్రభుత్వానికి, తెదేపాకి, రాష్ట్రానికి, ప్రజలకి అందరికీ మేలు చేస్తుంది. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి చాలా అన్యాయం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. కానీ అది కూడా అదే తప్పు చేయడం భావ్యం కాదు.