డిల్లీ శాసనసభలో జన్ లోక్ పాల్ బిల్లును ఆమోదించినపుడు ప్రతిపక్ష పార్టీలతో సహా ఒకప్పుడు ఆమాద్మీ పార్టీలో ఒక వెలుగు వెలిగిన ప్రశాంత్ భూషణ్ తో సహా చాలా మంది దానిని అపహాస్యం చేస్తునప్పుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే డిల్లీ ప్రభుత్వానికి బాసటగా నిలబడ్డారు. అప్పుడే విమర్శకుల నోళ్ళు మూతలుపడ్డాయి. కానీ ఇప్పుడు ఆ గురువుగారే కేజ్రీవాల్ ని విమర్శించారు. డిల్లీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై సిబిఐ అధికారులు దాడులు చేయడంపై డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, అన్నా హజారే ఆయననే తప్పు పట్టారు.
రాజేంద్ర కుమార్ ఎటువంటి వ్యక్తో, అతని నీతివంతుడా కాదా అనే విషయాలు తెలుసుకోకుండా ప్రధాన కార్యదర్శిగా నియమించుకోవడం పొరపాటు. సిబిఐ అధికారులు ఆయన అవినీతిపరుడని గుర్తించిన అతనిపై కేసు నమోదు చేసిన తరువాత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు చిందులు వేయడం అనవసరం అని అన్నా హజారే అభిప్రాయపడ్డారు. ఇంతవరకు మోడీ ప్రభుత్వంపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఇప్పుడు అన్నా హజారే చేసిన విమర్శలతో బీజేపీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ పై ఎదురుదాడి చేసే అవకాశం ఉంది.