వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటిసారి పిసిసి అద్యక్షుడయ్యేనాటికి వయస్సు కేవలం 35 సంవత్సరాలు. అప్పటికే అమితాదరణ పొందిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నారు. అయినా సరే మొండి ధైర్యంతో పదవి చేపట్టారు. తర్వాత ఎన్టీఆర్ ఓడిపోయేనాటికి చెన్నారెడ్డి వచ్చి చేరి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అంటుండేవారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబును విమర్శించడానికి ఎన్టీఆర్ను ప్రశంసించడం పరిపాటి అయింది గాని నిజానికి మొదట్లో ఆయనను గట్టిగా ఎదుర్కొన్న నేపథ్యం వుంది. ఇంతకూ ఇన్నేళ్ల తర్వాత అన్న ఎన్టీఆర్కు రాజన్న రాజశేఖరరెడ్డికి పోటీ వచ్చింది. మంగళగిరి ఎంఎల్ఎ, భారీ వ్యాపార సంస్థ రామ్కీ అధినేత సోదరుడు అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గంలో రాజన్న క్యాంటిన్లు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటిన్లు పెట్టి చౌకగా ఆహారపదార్థాలు అందిస్తానన్న వాగ్దానం నెరవేర్చలేదు గనక తన స్వంత డబ్బుతో రాజన్న క్యాంటిన్లు పెట్టి నాలుగు రూపాయలకే భోజనం పెడతామని ప్రకటించారు. ఈ మద్యనే ఆయన హైదరాబాదులో జిహెచ్ఎంసి అన్నపూర్ణ పథకం కింద అయిదు రూపాయలకు అందిస్తున్న భోజనం రుచి చూశారు. అంతటి సంపన్నుడు కాన్సర్ ఆస్పత్రి దగ్గర అయిదు రూపాయల భోజనం చేయడంలోని నిరాడంబరతను మీడియా కొనియాడింది గాని తన పథకానికి ముందు అవగాహన కోసం ఆ పనిచేసివుంటారు. చాలా కాలంగా మంగళగిరిలో ఆయన భారీ ప్రచారం బహుముఖ కార్యక్రమాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోవడంపై దృష్టి పెట్టారు. రాజధాని రైతుల కేసులు ప్రభుత్వ అవకతవకలు కోర్టులో సవాలు చేసి కొన్ని ఫలితాలు రాబట్టారు కూడా ఓటుకు నోటులోనూ ఒకింత కదలిక తెచ్చారు. అలాటి క్రియాశీల వ్యాపార రాజకీయ వేత్త రాజన్న క్యాంటిన్లు పెట్టడం ప్రభుత్వానికి అబిశంసనే.