కృష్ణవంశీ నుంచి కొత్త సినిమా వస్తోంది.. అదే `అన్నం`. రంగమార్తాండ తరవాత… కృష్ణవంశీ చేసే సినిమా ఇదే. ఆ టైటిల్, ఫస్ట్ లుక్ – అందరినీ ఆకర్షించాయి. కృష్ణవంశీ మార్క్ చూడబోతున్నామన్న భరోసా కల్పించాయి. అయితే నిజానికి ఇదేం ఇప్పటికిప్పుడు పుట్టిన కథ కాదు. ఇది వరకే కృష్ణవంశీ దగ్గర `రైతు` అనే స్క్రిప్టు ఉంది. నందమూరి బాలకృష్ణతో ఈ సినిమా చేద్దాం అనుకున్నాడు కృష్ణవంశీ. అమితాబ్ బచ్చన్‌తో ఓ కీలకమైన పాత్ర చేయిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు అది కుదర్లేదు. ఆ కథకే కీలకమైన మార్పులు చేసి `అన్నం` గా మార్చాడని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలోనూ ఓ అగ్ర కథానాయకుడు నటిస్తాడని సమాచారం. ఆ హీరో ఎవరన్నది టాలీవుడ్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కృష్ణవంశీ `రంగమార్తండ` ఇప్పుడు విడుదల కావల్సివుంది. ఆ సినిమాతో కృష్ణవంశీ మార్క్ మరోసారి బయటపడితే – బాలయ్య, చిరు లాంటి అగ్రహీరోలు ఈ కథపై దృష్టి సారించే అవకాశంఉంది. ప్రస్తుతానికి `అన్నం` ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఓ హీరో అయినా కృష్ణవంశీకి ఇది వరకే కమిట్ అయ్యాడా? లేదంటే స్క్రిప్టు పూర్తి చేసి, హీరోల అన్వేషణ మొదలెడతాడా? అన్నది తెలియాల్సివుంది.