తన ప్రభుత్వం వల్ల లబ్ది పొందిన వారే తన స్టార్ క్యాంపెయినర్స్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. అలాంటి స్టార్ కంపెయినర్స్ సొంత జిల్లాలోనూ లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ఇసుక మాఫియా, నిర్లక్ష్యం కారణంగా కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాం బాధితులంతా జగన్ మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయినర్లే.
అన్న మయ్య డ్యాను ఇట్టే నిర్మిస్తాం.. .. ఈ సారి బీభత్సం… జగన్ రెడ్డి అంటే.. ఏంటో అన్నమయ్య డ్యాం నిర్మాణంలోనే తెలిసిపోతుందని డబ్బా కొట్టారు. మూడేళ్లు అయింది. టెండర్లు పిలిచి….అంచనాలను భారీగా పెంచి తెలంగాణ రెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చారేమో .. బయటకు తెలియదు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. జగన్ రెడ్డి భాషలో చెప్పాలంటే… ఇంకా టెంకాయ కూడా కట్టలేదు.
అన్నమయ్య డ్యాం బాధితులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సర్వం కోల్పోయారు. కుటంబసభ్యులనూ కోల్పోయారు. డ్యాం కొట్టుకుపోవడానికి వైసీపీ నేతల స్వార్థం.. మరమ్మతులకు నిధులు ఇవ్వని ప్రభుత్వ నిర్వాకం కారణం. అలాంటప్పుడు బాధితుల్ని ఎలా ఆదుకోవాలి. తమ తప్పు వల్ల అంత మంది ప్రాణాలు పోయాయని.. ఆస్తులు కోల్పోయారని.. తప్పు ఫీలవ్వాలి. ప్రాణాలు తెచ్చివ్వలేరు కానీ.. కనీసం ఆదుకోవాలి.
డ్యాం కొట్టుకుపోయిన వారానికి వెళ్లి బాధితుల్ని పరామర్శించిన జగన్ లోకల్ లాంగ్వేజ్ లో అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. అన్నీ తనకు వదిలి పెట్టమన్నారు. వదిలి పెట్టడానికి ఏమీ లేదు అన్నీ కొట్టుకుపోయాయని బాధితులు బోరుమన్నారు. ఇప్పటికీ ప్రజలు వదిలి పెట్టే ఉన్నారు. ఇదేంది గురూ అని అక్కడి ప్రజలు మీడియా ముందు ఫైర్ అయితే.. కాంట్రాక్టర్ కు చెప్పి ఇళ్ల పునాదులు వేయించారు. మళ్లీ పట్టించుకోలేదు. . బాధితులకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి గాలికొదిలేశారు. ఇప్పటికీ బాధితులు స్వచ్చంద సంస్థలు ఇచ్చిన టార్పాలిన్ గుడిసెల్లో ఉంటున్నారు. రోడ్లు నిర్మించలేదు.
రాజంపేట ప్రధాన వంతెన పూర్తి స్థాయిలో ధ్వంసం అయింది. వంతెన కింద నుంచి రాకపోకల కోసం రోడ్డు వేశారు. కానీ నదిలో నుంచి రోడ్డు ఎలా వేస్తారనే స్పృహ కూడా రాలేదు. వర్షాలుపడినప్పుడు ఆ రోడ్డు కొట్టుకుపోతోంది. ఇబ్బందులు పడుతున్న ప్రజలకే వాటి గురించి తెలుసు. వారే జగన్ మోహన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్లు.