ఓటీటీల ప్రాధాన్యత పెరుగుతోంది. భవిష్యత్తులో థియేటర్లకు ప్రత్యామ్నాయం ఓటీటీలే అన్నది సినీ జనాల నమ్మకం. అందుకే బడా ప్రొడ్యూసర్లు ఓటీటీ వేదికలపై దృష్టి పెడుతున్నారు. గీతా ఆర్ట్స్.. ఆహా నెలకొల్పింది. అలానే మిగిలిన బడా నిర్మాతలూ… అటు వైపు అడుగులేస్తున్నారు. తాజాగా నాగార్జున సైతం.. ఓటీటీ వేదిక నెలకొల్పాలన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్. ఇందుకు సంబంధించి ఆయన ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు చిన్న సినిమాల నిర్మాణంపై బాగా ఫోకస్ చేసిందట. యేడాదికి ఆరేడు చిన్న సినిమాల్ని నిర్మించాలన్నది ప్లాన్. ఇవన్నీ ఓటీటీల కోసమేనట. అన్నపూర్ణ ఫిల్మ్ స్టూడియో నుంచి కొత్తతరం వస్తోంది. వాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి అన్నపూర్ణ స్టూడియోస్ సైతం సిద్ధంగా ఉంది. కనీసం వాళ్లందరికీ ఓ వేదిక కల్పించడానికైనా చేతిలో ఓ ఓటీటీ ఉంటే బాగుంటుందన్నది నాగ్ ఆలోచన. అయితే ఆయనొక్కడే ఓటీటీలోకి దిగడం లేదు. తనతో పాటు కొంతమంది మిత్రుల్నీ కలుపుకోబోతున్నార్ట. ఆహాలానే నలుగురైదుగురు పార్టనర్స్ ఇందులో ఉంటారని, నాగ్ కి అత్యంత సన్నిహితులే వాటాదారులు అవుతారని సమాచారం.