ఇది వరకు సినిమా టైటిల్ అంటే.. ఎంత మాసీగా ఉంటే అంత కిక్కు. అయితే రాను రాను… ఫ్యామిలీ టైపు టైటిళ్లు వరుస కట్టడం మొదలెట్టాయి. ఎప్పుడైతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది… లాంటి టైటిళ్లు అగ్ర కథానాయకుల సినిమాలకు పెట్టారో… క్లాస్ టైటిళ్లకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు మరో ఫ్యామిలీ టైటిల్ వచ్చింది. అదే… `రా రండోయ్ .. వేడుక చూద్దాం`. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ టైటిల్ని ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. ఇది నాగ చైతన్య కోసమా, అఖిల్ కోసమా?? అనే కన్ఫ్యూజన్ నెలకొంది.
అఖిల్ రెండో చిత్రం విక్రమ్ కె.కుమార్ తో ఫిక్సయిన సంగతి తెలిసిందే. అదో ఫ్యామిలీ డ్రామా అని సమాచారం. విక్రమ్ కె.కుమార్ చెప్పిన టైటిల్ ఇదేనని, వెంటనే నాగ్ రిజిస్టర్ చేయించేశారని తెలుస్తోంది. అయితే.. నాగచైతన్య – కల్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా ఇలానే ఓ ఫ్యామిలీ డ్రామా. దానికీ నాగార్జునే ప్రొడ్యూసర్. ఆ సినిమా కోసమే.. ఈ టైటిల్ ఫిక్స్ చేశారని చెబుతున్నారు. విక్రమ్ కె.కుమార్ కథలే కాదు.. టైటిళ్లూ కొత్తగా ఉంటాయి. 13 బి, ఇష్క్, 24.. ఇలాంటి టైటిళ్లు ఆయన్నుంచి వచ్చాయి. ఈసారీ.. అలాంటి డిఫరెంట్ టైటిలే ఎంచుకొని ఉంటాడని, అందుకే ఈ టైటిల్ కచ్చితంగా చైతూ సినిమాకే అని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. మరి.. ఈ వేడుక ఎవరి కోసమో చూడాలి.