కూటమి విజయం కోసం పని చేసిన.. టిక్కెట్లు త్యాగం చేసిన వారికి పదవులు పంపిణీ చేసే విషయంలో కసరత్తు చాలా క్లిష్టంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దరఖాస్తులు తీసుకుని..పార్టీ నేతల సమాచారం తెప్పించుకుని.. అన్ని రకాలుగా కసరత్తు చేసినా కేవలం 47 మార్కెట్ కమిటీ చైర్మన్లను ప్రకటించారు. ఇందులో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు ఇచ్చారు. డైరక్టర్ పోస్టులకు కూడా ఆ ఫార్ములా ప్రకారమే పదవులు ఇచ్చారు.
భర్తీ చేయాల్సిన పదవులు పెద్ద ఎత్తున ఉన్నాయి. 214 మార్కెట్ కమిటీలకు పదవులు ప్రకటించాల్సి ఉంది. అన్ని పదవులకు ఒకే సారి ప్రకటిస్తామని చెప్పినా 47 మార్కెట్ యార్డ్స్ విషయంలోనే క్లారిటీ వచ్చింది. 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమించాల్సి ఉంది. వాటి పాలక మండళ్లు.. ఇతర పదువులు భర్తీ చేయాల్సినవి భారీగా ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికే అవకాశాలు కల్పిస్తామని టీడీపీ హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. కానీ వారెవరో గుర్తించడానికి చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి రావడం లేదు.
నామినేటెడ్ పదవుల కోసం 60వేల దరఖాస్తులు వచ్చాయని చంద్రబాబు ప్రకటించారు. పదవులు రాని వారికి ఇప్పుడు పదవులు పొందుతున్న వారి రెండేళ్ల పదవీకాలం ముగిశాక మిగిలినవారికి కూడా అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. మార్చి నెలాఖరులోపు అన్ని పదవులు భర్తీ చేయాలనుకున్నా.. ముందుకు సాగకపోవడంతో కూటమి నేతలు గట్టిగా పదవుల కోసం పట్టు బడుతున్నారని అనుకోవచ్చు.