జగన్ రెడ్డి ఆర్థిక నేరాల కింగ్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు.. అయితే ఆయన ఇప్పుడు ఏపీ సీఎం. అలాంటి ఆర్థిక నేరాలు చేయడం ప్రివిలేజ్ అనుకుంటున్నారో ఏమో కానీ… ప్రతిష్టాత్మక పదవుల్లో సంచలన ఆర్థిక నేరాలు చేసిన వారికి కోటా పెట్టి మరీ పదవులు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీటీడీ బోర్డులో ఆయన నియమించిన వారిని చూస్తే.. ఇది నిజమేనని అనిపించక మానదు.
తీహార్ జైలు నుంచి నేరుగా టీటీడీ బోర్డులోకి వచ్చేశారు పెనాక శరత్ చంద్రారెడ్డి. అరబిందో గ్రూపు వారసుల్లో ఒకరు అయిన ఆయన.. ఈజీ మనీ కోసం ఢిల్లీలో లిక్కర్ స్కాం చేసి పట్టుబడ్డారు. బయటపడటం కోసం జగన్ రెడ్డి చేసిన లాబీయింగ్ లో భాగంగా అప్రూవర్ గా మారి…. బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన టీటీడీ బోర్డు మెంబర్. విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా.
అంతే కాదు.. టీటీడీ బోర్డులో ఉన్న మరో పేరు కేతన్ దేశాయ్.. దేశంలోవైద్య విద్యను సంస్కరించాల్సిన భారత వైద్య మండలికి చైర్మన్గా ఉండి… ఓ కాలేజీ అనుమతి కోసం రూ . రెండు కోట్లు లంచం తీసుకుంటూ నేరుగా దొరికిపోయిన ఘన చరిత్ర. ఇలా ఒక సారి కాదు.. రెండు సార్లు పదవులు పోగొట్టుకున్నారు. రెండు సార్లూ అవినీతి ఆరోపణల కారణంగానే. చాలా రోజులు జైల్లో ఉన్నారు. ఇప్పుడీయన హఠాత్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో శాశ్వత సభ్యుడయ్యారు. ప్రతీ సారి కొనసాగింపు ఇస్తున్నారు
అంతే కాదు బోర్డులో నియమించిన ఇతరులపైనా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వారి గురించిన వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు హైదరాబాద్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని నియమించారు. ఆయన ప్రీలాంచ్ ఆఫర్లతో జనాలకు మూడు, నాలుగు వేల కోట్లు కొట్టేసి… సైలెంట్ అయిపోయారు. ఆయన స్థానంలో వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను తీసుకున్నారు . ఆయనకు పొడిగింపు ఇవ్వలేదు.