ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు రేపో మాపో సాక్షి పత్రికను చానల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చేసిన ప్రకటనను రాజకీయ కోణంలో చూడాలి తప్ప మరీ సాంకేతికంగా తీసుకోవద్దని తెలుగుదేశం నేతలు వివరిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం అరెస్టు సందర్భంగా కొన్నిచోట్ల సాక్షి ఛానల్ ప్రసారాలు నిలిపివేసిన నిర్ణయాన్ని దీన్ని కలిపి చూస్తే తప్ప ఈ వ్యాఖ్యల సారాంశం అర్థం కాదు. తెలంగాణలోనూ ఎపిలోనూ కూడా ఛానళ్ల ప్రసారాల నిలిపివేత కొత్తకాదు గాని సాక్షి విషయంలో తీసుకున్న చర్యను రాజకీయ కోణంలో చూడవలసి వస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక కోర్టులచట్టం 2015 రాష్ట్రపతి ఆమోదం పొందినా సాక్షి స్వాధీనానికి ఆటోమాటిగ్గా అవకాశం లభించదు. 2002 మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద ఆస్తుల అటాచ్మెంట్ అంటే అర్థం వాటిపై ఎలాటి లావాదేవీలు బదలాయింపులు జరక్కుండా కట్టడి చేయడం మాత్రమే తప్ప జప్తు(కన్ఫిస్కేషన్) కాదు. చట్టం చాప్టర్ 111 సెక్షన్2(1)డిలో ఇందుకు సంబంధించి సమగ్రమైన వివరణ వుంది.అదే సమయంలో సాక్షి జగన్ వ్యక్తిగత ఆస్తికాదనే వాదన కూడా నిలిచేది కాదు. నిజానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా కాలం కిందటే సాక్షి ఆస్తులు కట్టడి చేసింది. అయినా నిర్వహణను అనుమతించి జీతభత్యాలు ఇతర దైనందిన అవసరాల మేరకు నిధుల విడుదలను అనుమతిస్తున్నది. అయితే వున్న కేసుల విచారణ పూర్తయి, నేర నిర్ధారణ లేక నిరాకరణ జరిగి అత్యున్నత న్యాయస్థానంలో అంతిమ తీర్పులో ఈ ఆస్తులను ఏం చేయాలన్నది నిర్దిష్టంగా చెప్పవలసి వుంటుంది. అప్పుడు మాత్రమే ఆ ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వ ఆజమాయిషీలోకి వస్తాయి. అప్పుడైనా ప్రత్యేక కోర్టు తీర్పు వచ్చాకనే అడుగు ముందుకేయడం సాధ్యం తప్ప ఏకపక్షంగా ఏమీచేయడానికి వుండదు.ప్రాథమిక ఆధారాలతో కట్టడి చేసుకున్న ఆస్తులను తీసేసుకుంటే తుది తీర్పు మరో విధంగా వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఆస్తులు అటాచ్మెంట్లోకి వెళ్లాయి గనక కేంద్రం విచారణ పూర్తికాకుండానే తీసేసుకోగలుగుతుందా?జయలలిత కేసులో శిక్ష పడి కూడా తర్వాత కొట్టివేయడం చూశాం. అలాటప్పుడు ఆమె ఆస్తులను ముందే తీసేసుకుని వుంటే ఏమయ్యేది?
ప్రత్యేక కోర్టుల కోసం నోటిఫికేషన్, నియామకం,దాని ముందుకు ఈ కేసు విచారణ తీర్పు ఇన్ని దశలుండగా రేపో మాపో స్వాధీనం చేసుకోవడం గురించి యనమల వంటి అనుభవశాలికి తెలియదని కాదు. అయినా ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే రాజకీయ హెచ్చరికగానే తీసకోవలసి వుంటుంది. జగన్‌ను ఆయనతో వున్న గట్టినేతలను కాకున్నా అభిమానులు ఇతరులను ఈ ప్రకటనతో ప్రభావితం చేయగలమని తెలుగుదేశం ఆలోచన.
మీడియా కోణంలో చూస్తే మాత్రం జగన్‌పై ఆరోపణలున్నాయి గనక సాక్షిలో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాకూడదని శాసించడం కాదు గదా ఆశించడమే తప్పు. అధికారంలోకి వచ్చాక చాలామందికి మీడియాలో విమర్శలు వ్యతిరేక కథనాలు రుచించవు.వైఎస్‌ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆ రెండు పత్రికలు అనేది వూతపదంగా వాడేవారు. టిఆర్ఎస్ టిడిపిలు కూడా ప్రతికూల పత్రికలు ఛానళ్లపై విరుచుకుపడటం అలవాటు చేసుకున్నాయి. రాజకీయంగా ఏదైనా చేయొచ్చునేమో గాని చట్ట ప్రకారం మాత్రం అటాచ్మెంట్లో వున్న సంస్థలన్నీ గుప్పిట్లోకి తీసుకోవాలనుకోవడం కుదిరేపని కాదు. దీనివల్ల మీడియా స్వేచ్చను కాపాడాలనే నినాదం ముందుకు రావడం తప్పనసరి.వ్యతిరేక వార్తలువస్తున్నాయనే పేరుతో గనక స్వాధీనం చేసుకోవాలనుకుంటే అప్పుడు మరింత విస్త్రతమైన నిరసన వస్తుంది.అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అసెంబ్లీలో రభస తప్ప జగన్‌పై ఒక్క ఆరోపణను ప్రభుత్వం అదనంగా ఫిక్స్ చేసింది లేదు. ఆ కేసులు త్వరగా తేల్చిచట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఏ అభ్యంతరమూ వుండదు. ఈలోగా ఏదైనా చేస్తున్నారంటే అది కేవలం రాజకీయ రగడకోసమే ఉపయోగపడుతుంది. జగన్‌కు కూడా మరో ఆయుధం దొరుకుతుంది.