పారిస్ దాడి అనంతరం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఉపయోగించుకునే సోషల్ మీడియా అకౌంట్స్ ను హ్యాక్ చేస్తూ వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న అపరిచితుడు (Anonymous) ఇప్పుడు ఉన్నట్టుండి అమెరికాకు చెందిన డోనాల్డ్ ట్రంప్ మీద విరుచుకుపడుతున్నాడు. పారిస్ మీద దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణిస్తూ, వారిపై సాంకేతికపరంగా యుద్ధం ప్రకటిస్తున్నామనీ, దమ్ముంటే కాచుకోమంటూ హ్యాకర్ల గ్రూప్ (Anonymous) సవాలు విసిరింది. అందుకు తగ్గట్టుగానే ఉగ్రవాదులు ఉపయోగించే వేలాది ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసిపారేసింది. ఉగ్రవాదులను హడలెత్తించిన హ్యాకర్ల బృందంలోని సభ్యులు తమ హెచ్చరికలను వీడియోద్వారా కూడా పంపిస్తుంటారు. వారిలో ఒకడు తమ గ్రూప్ (Anonymous) గుర్తుగా విచిత్రమైన ముసుగువేసుకుని సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటారు. ఇలాంటి Anonymous (అపరిచిత) హ్యాకర్లు ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ మీద పడ్డారు. ఇప్పటికే అపరిచత హ్యాకర్లు డోనాల్డ్ ట్రంప్ కి చెందిన http://www.trumptowernyc.com వెబ్ సైట్ ని హ్యాక్ చేశారు. అంతేకాదు, యుట్యూబ్ లో వీడియో పోస్ట్ చేస్తూ, ట్రంప్ కు గట్టిగా మొట్టికాయలేశారు.
ఇంతకీ ఎవరీ డోనాల్డ్ ట్రంప్? ఎందుకని అపరిచిత హ్యాకర్లకు ఇతగాడిపై అంత కోపం ? ఈ విషయాలు ముందుగా తెలుసుకుందాం…
అమెరికాలో అధ్యక్షపదవికి జరిగే ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇతనికి రాజకీయ అనుభవం తక్కువే. ఆవేశం ఎక్కువ. బాగా సంపన్నపరుడు. రియలెస్టేట్ దిగ్గజంగా ఎదిగాడు. వ్యాపార లక్షణాలు బాగా అబ్బిన డోనాల్డ్ ట్రంప్ కి మీడియా పట్ల మోజెక్కువ. ఇతగాడు ఉన్నట్టుండి అధ్యక్షపదవికి పోటీచేయాలనుకోవడం, అందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో అతగాడి కామెంట్స్ ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. అలాంటి డోనాల్డ్ ట్రంప్ ఈ మధ్యనే ఓ సంచలన వ్యాఖ్య చేశాడు. అమెరికాలోకి ముస్లీంలు ప్రవేశించకుండా నిషేధం విధించాలని అనడంతో యావత్ ప్రపంచం విస్తుపోయింది. ఇతని వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ అమెరికాలోని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. పబ్లిసిటీ స్టంట్ గా దీన్ని అభివర్ణించారు. ఈమధ్య కాలిఫోర్నియా భారీకాల్పుల సంఘటనకు తమ మద్దతుదారులదే బాధ్యతంటూ ఐఎస్ఐఎస్ ప్రకటించిన దరిమిలా, డోనాల్డ్ ట్రంప్ మొత్తం ముస్లీం మతస్థులమీదనే మండిపడ్డారు. ముస్లీంలను ఎవ్వరినీ అమెరికా సరిహద్దులు దాటి లోపలకు రాకుండా వారిని నిషేధించాలంటూ ఊగిపోయారు.
అపరిచిత ( Anonymous) హ్యాకర్స్ గ్రూప్ కి డోనాల్డ్ ట్రంప్ కామెంట్స్ నచ్చలేదు. అందుకే వారు డోనాల్డ్ ట్రంప్ వెబ్ సైట్ ని హ్యాక్ చేయడంతోపాటుగా యూట్యూబ్ లో వీడియో పెట్టి డోనాల్డ్ కి హెచ్చరికలు జారీచేశారు. ఒక పక్క ఐఎస్ఐఎస్ ఉగ్రవాదంపై వార్ డిక్లేర్ చేసిన ఈ హ్యాకర్లు ఇప్పుడు ముస్లీంలపై డోనాల్డ్ చేసిన వ్యాఖ్యలకు కోపంతెచ్చుకోవడం కాస్తంత గజిబిజిగానే ఉండవచ్చు. అయితే వారి ఉద్దేశం వారిది. అందులో ఓ మర్మం దాగుంది. అదేమిటంటే…. ( Anonymous హ్యాకర్ మాటల్లోనే….)
1. డోనాల్డ్ ట్రంప్ , నీవు అమెరికాలోకి ప్రవేశించే ముస్లీంలందరిపై బ్యాన్ పెట్టాలంటున్నావ్… ఇది చాలా చెడు ప్రభావం చూపుతుంది.
2. ముస్లీంలు ఎక్కువగా బాధపడితే, అందుకు తగ్గట్టుగానే ఐఎస్ఐఎస్ స్పందిస్తుంది. అప్పుడు వారు (ఉగ్రవాదులు) ఎక్కువమందిని చేర్చుకుంటారు.
3. ఉగ్రవాద సమస్య పెద్దది కావడానికి మీ వ్యాఖ్యలు దోహదమవుతాయి. ఇలాంటి కామెంట్స్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.
అమెరికా భూభాగంపై ఐఎస్ఐఎస్ జాడలు తొలిసారిగా, కాలిఫోర్నియాలో 14మందిని కాల్చిచంపిన ఘటనతోనే బయటపడింది. దీంతో సహజంగానే అమెరికన్లలో భయాందోళనలు పొడజూపాయి. ఆవేశంపాలు ఎక్కువైన డోనాల్డ్ ట్రంప్, వెంటనే తన ప్రచరానికి `ట్రంప్ కార్డ్’ లా `ముస్లీంలపై బ్యాన్’ అంశం బయటకులాగాడు. అయితే అది రివర్సయింది. చివరకు ( Anonymous) హ్యాకర్స్ గ్రూప్ నుంచి మొట్టికాయలు తినాల్సివచ్చింది. మొత్తానికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదంపై పోరుజేస్తున్న Anonymous (అపరిచిత హ్యాకర్ల గ్రూప్) మాత్రం ఈ వ్యవహారంలో ప్రశంసలు అందుకుంటున్నది.
– కణ్వస